Oct 27,2021 18:44

ప్రజాశక్తి - ఏలూరు
            క్షయ వ్యాధి(టిబి) నియంత్రణలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు మెరుగ్గాఉన్నాయని హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.అనురాధ అన్నారు. జిల్లాలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో క్షయ వ్యాధి (టిబి)పై రోగులకు అందిస్తున్న సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన సభ్యుల బృందం బుధవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను సీనియర్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ ఆధ్వర్యంలోని సభ్యుల బృందం కలిసి నివేదికను అందించి క్లుప్తంగా వివరించారు. జాతీయస్థాయితో పోలిస్తే జిల్లాలో క్షయ రోగులకు అందిస్తున్న సేవలు, వైద్య పరీక్షలు, సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యంగా జ్యూట్‌మిల్‌ కార్మికులకు నిర్వహిస్తున్న క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరిన్ని నిర్వహించాలని, చిన్న పిల్లల్లో క్షయ వ్యాధిని గుర్తించే పరీక్షలను విస్తృతం చేసేలా నివేదికలో కోరామన్నారు. డిస్ట్రిక్ట్‌ టీబీ కంట్రోల్‌ ఆఫీస్‌కు శాశ్వత భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో తమ టీము సభ్యులు క్షయపై క్షేత్రస్థాయిలో పర్యటించి రోగులకు అందిస్తున్న సేవలు, ఆసుపత్రులు, వైద్య పరీక్షలపై నివేదికలు రూపొందించామన్నారు. జిల్లాలో తమ టీమ్‌ సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి భీమడోలు, చింతలపూడి మండల పరిసర గ్రామాల్లో పర్యటించామన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ఆసుపత్రుల్లో పర్యటించి ఎఆర్‌టి, ఐటిడిసి ట్రీట్‌మెంట్‌ సెంటర్లను, ఆశ్రమం ఆసుపత్రిని పరిశీలించామని చెప్పారు. జెసి హిమాన్షు శుక్లాతో పాటు డాక్టర్‌ అనురాధ మీడోజు నాయకత్వంలోని ఈ టీమ్‌లో డాక్టర్‌ జోసఫ్‌ కరేల్‌ టీమ్‌ లీడర్‌గా, నేషనల్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వినీత్‌ కుమార్‌, ఎన్‌టిఇపి, డబ్ల్యూహెచ్‌ఒ కన్సల్టెంట్‌ డాక్టర్‌ మహేష్‌ గొర్లం, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బి.రవి, డిస్టిక్‌ టీబి కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.భానునాయక్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్టేట్‌ టిబి ఆఫీస్‌ డాక్టర్‌ టి.రమేష్‌ ఉన్నారు.