Jun 11,2021 15:37

హైదరాబాద్‌ : ఖమ్మం టిఆర్‌ఎస్‌ ఎంపి నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలు సహా ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులకు సుమారు రూ.వెయ్యి కోట్లు మోసం చేసినట్లు, రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలతో వచ్చిన అభియోగాలతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నామాతో పాటు మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారు అన్వేషిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఇది సోదాలు కొనసాగే అవకాశముంది.