Nov 30,2020 00:25

పింఛన్లు అందిస్తున్న వాలంటీర్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
జిల్లాలో పింఛన్‌ లబ్ధిదారులు కొద్దిగా తగ్గారు. మూడు నెలలుగా పింఛన్లు తీసుకోకపోవడం, చనిపోవడం, అనర్హులుగా గుర్తించడం వంటి కారణాలతో 1175 మందికి డిసెంబరు పింఛన్‌ రద్దు చేశారు. నవంబరులో 4,88,725 మందికి పింఛన్లు మంజూరుకాగా, డిసెంబరు నాటికి ఆ సంఖ్య 4,87,550కు తగ్గింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పుకళాకారులు, ఒంటరి మహిళ, ట్రాన్స్‌జెండర్‌కు ప్రతినెలా ప్రభుత్వం పింఛన్లు చెల్లిస్తోంది. ఇలా నవంబరులో పింఛన్లు పొందుతున్న 4,88,725 మందికి రూ.118.49 కోట్లు విడుదల చేసింది. డిసెంబరులో 4,87,550 మంది పింఛన్‌దారులకు పెన్షన్‌ చెల్లించేందుకు రూ.119.37 కోట్లు విడుదల చేయనుంది. గతంలో రెండు నెలలు వరుసగా పింఛన్‌ తీసుకోకపోతే వాటిని రద్దు చేసేవారు. ఈసారి అలా కాకుండా రెండు నెలలు పింఛన్‌ తీసుకోకపోయినా, మూడో నెల తీసుకుంటే మూడు నెలలు కలిపి ఒకేసారి పింఛన్‌ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అందుకని డిసెంబరులో పింఛన్‌దారులు కొద్దిగా తగ్గినా, విడుదల చేసిన పింఛన్‌ డబ్బులు మాత్రం నవంబరు కంటే డిసెంబరులో ఎక్కువగా వున్నాయి. జిల్లా వ్యాపితంగా వివిధ రకాల పింఛన్ల కోసం 25వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.