Jul 18,2021 12:43

కోవిడ్‌ వల్ల పిల్లలకు అనుకోకుండా సెలవులు వచ్చేశాయి. ఈ సెలవుల్లో టీవీలకు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోయి, పుస్తకాలను ముట్టుకోకుండా కాలం గడిపేస్తున్న మనవల్ని చూసి, మనసులో కాస్త కలత చెందాడు సీతారామయ్య.
'పుస్తకాలు తీసి కాసేపు చదవండి. మీకు నచ్చిన అంశాలను రాసుకోండి' అని ఆయన ఎంత మొత్తుకున్నా పిల్లలు పట్టించుకోవడం లేదు. పిల్లల తలిదండ్రులు కూడా 'పోనీలెండీ బడులు లేకపోతే పిల్లలకి పుస్తకాల మీద ధ్యాస ఉండదు. కొన్నాళ్ళు పుస్తకాలకి దూరంగా వుండనిద్దురూ' అని పిల్లలకే సపోర్ట్‌ చేస్తున్నారు.
'పిల్లలు సెలవుల్లో సరదాసందడి చేస్తారుగానీ పుస్తకాల పురుగులు కాలేరు. అనుకోకుండా వచ్చిన సెలవుల్ని ఎంజారు చెయ్యనివ్వండి వాళ్ళకి నచ్చినట్లు' అని సీతారామయ్య భార్య లచ్చుమమ్మ నవ్వుతూ భర్తనే సున్నితంగా మందలిస్తుంది.
'ఎప్పుడూ టీవీలు, మొబైళ్ళు, కంప్యూటర్లతోనే కాలం గడిపేస్తుంటే తాతయ్య బాధపడుతున్నారు. అప్పుడప్పుడు పుస్తకాలు తీద్దాం' అని ఒక బుడ్డోడు అన్నాడు. 'ఇప్పుడు పుస్తకాలు తియ్యడం కష్టం కానీ తాతయ్యను మెప్పించడానికి బొమ్మలు వేద్దాం, చిన్న చిన్న గేయాలు, కథలు రాద్దాం. చదవడం అంటే బోర్‌ బ్రదర్‌' అని అన్నాడు ఇంకొక గడుగ్గాయి.
పిల్లలు రోజులో కాసేపైనా బొమ్మలు వెయ్యడం, చిన్న చిన్న కథలు, గేయాలు రాయడం చూసి సంతోషించాడు సీతారామయ్య. ఇలాంటప్పుడే పిల్లల దృష్టిని పుస్తకాలు వైపు మరల్చాలని ఒక ఆలోచనకు వచ్చాడు.
ఒకరోజు ఉదయాన్నే 'మహనీయుల మంచిమాటలు' అనే పుస్తకాన్ని తీసుకున్నాడు. అందులో చిన్నపిల్లలకు అర్థమయ్యే మంచి మాటలున్న పేజీలు తెరిచి, వాటిపై ఒక నెమలి పింఛాన్ని, గులాబీ పువ్వుని పెట్టాడు. దానిని హాల్‌లో టేబుల్‌ మీద ఉంచాడు సీతారామయ్య.
పిల్లలు ఆడుకుంటూ హాల్లో టేబుల్‌ మీద తెరిచివున్న పుస్తకాన్ని చూశారు. పుస్తకంపైన ఉన్న నెమలి పింఛము, గులాబీపువ్వును చూసి ఆసక్తిగా పుస్తకం వైపు వెళ్లారు. వారి దృష్టి తెరిచిన పేజీల్లోని చక్కని చిత్రాలు, వాటి కింద ఉన్న చిక్కని మాటల మీద పడింది. 'పుస్తకం బాగుంది' అని అందులోని మొత్తం పేజీలను పోటీపడి మరీ చదివేశారు పిల్లలు. వెంటనే తాతయ్య దగ్గరకు వెళ్లి 'మీ దగ్గర ఇలాంటి పుస్తకాలు ఉంటే ఇవ్వండి చదువుతాం' అని అడిగారు.
సీతారామయ్య నవ్వుతూ పిల్లలు చదవడానికి, రాయడానికి ఆసక్తిని కలిగించే కొన్ని పుస్తకాలను వారి చేతికిచ్చాడు. 'ఈ రోజుకి ఇవి చదవండి. వీటిలో ముఖ్యమైన అంశాలను రాసుకోండి' అని చెప్పాడు. పిల్లలు ఎవరికి దొరికిన పుస్తకాలను వాళ్ళు పట్టుకొని, దూరదూరంగా కూర్చొని, చదవడంలో నిమగమైపోయారు. కొంత సమయం తర్వాత వారిలో ఒక పిల్లాడు 'ఒరేరు ఇవి తాతయ్య రాసిన పిల్లల కథల పుస్తకాలురా' అని బిగ్గరగా అరిచాడు. 'అవునవును చాలా బాగున్నాయి. కథలు, వాటికి తగ్గ బొమ్మలు' అని అరిచారు మిగతా పిల్లలు. సీతారామయ్యతో పాటు ఇంట్లో అందరూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అంతే ఇంట్లోని హోమ్‌ థియేటరు, మొబైల్‌ ఫోన్లు మూగబోయాయి.
చిరుగాలికి నెమలిపింఛం రెపరెపలాడగా, గులాబీ రెమ్మలు గుభాళించాయి. 'అనుకున్నది సాధించాడు పెద్దాయన' అంటూ పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి గుసగుసలు వినిపించాయి.
సీతారామయ్య వాలుకుర్చీలో కూర్చుని, ముసిముసిగా నవ్వుకున్నాడు.
లచ్చుమమ్మ భర్త సీతారామయ్యను చూసి 'మొత్తానికి సాధించారు కవి కం రచయితగారు' అని బోసినవ్వులు రువ్వింది.
 

మీగడ వీరభద్రస్వామి
94415 71505