May 15,2021 20:05

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం కవి కోకిల గుర్రం జాషువా కాంస్య విగ్రహ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొన్నఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, నిర్ణయాత్మక సలహాలు, సూచనలు ఇవ్వకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం లేకపోతే విద్యార్థులకు జరిగే నష్టం అంతాఇంతా కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ఈ నెలాఖరు వరకు సెలవులు ఉన్నాయని, ఈ సమయంలో పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు మూడు వారాల సమయం ఉండడంతో ముందస్తు షెడ్యూల్‌ను ప్రకటించి కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి పాఠశాలలకు హాజరు కావాలని ఉపాధ్యాయులను ఆదేశించామని చెప్పారు.