Nov 22,2020 08:11

మలయాళీ నటి అనుపమ పరమేశ్వరన్‌ మొదటి సినిమా 'అఆ'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి సక్సెస్‌ అందుకుంది. 'ప్రేమమ్‌' 'శతమానం భవతి' 'ఉన్నది ఒకటే జిందగీ' 'కృష్ణార్జున యుద్ధం' 'హలో గురూ ప్రేమ కోసమే' 'రాక్షసుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత బాగా గ్యాప్‌ తీసుకున్న అనుపమ మళ్లీ తెలుగులో సినిమాలు నటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న అనుపమకు మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌కు జోడీగా నటిస్తోంది. నిఖిల్‌ హిట్‌ సినిమా 'కార్తికేయ'కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'కార్తికేయ 2' చిత్రంలో అనుపమను తీసుకున్నట్లు సమాచారం. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌-వివేక్‌ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. దీంతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో వస్తున్న '18 పేజెస్‌' అనే సినిమాలో కూడా అనుపమను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మొత్తానికి చూడగానే తెలుగింటి ఆడపిల్లలా కనపడే అనుపమ తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.