Oct 18,2020 09:03

నేడు ప్రపంచంలోని ఏ దేశమేగినా, ఏ ప్రాంతమెళ్లినా రెపరెపలాడుతూ అరుణ పతాకం కనిపిస్తుంది. కార్మిక రాజ్యాలు ఉన్నా, పోయినా ఎర్రజెండా లేకుండా ఎగురుతూనే ఉంటుంది. దాని ప్రభావంతో ప్రభవించిన సాహిత్యమూ, ఇతరత్రా సాంస్కృతిక కళా చైతన్యమూ కొనసాగుతూనే ఉంటాయి. మార్క్సిజం కార్మికులకు, కర్షకులకూ మాత్రమే పరిమితమైన సిద్ధాంతం కాదు. మొత్తం సమాజానికే కొత్త దారిని చూపించిన సరికొత్త తాత్విక ప్రకాశం. అక్షరక్షరానికి స్ఫూర్తి. ఆలోచనల్లోకి చైతన్యాన్ని ప్రసరించే దీప్తి. ఎర్రజెండా రెపరెపలు, దాని వెనక ఉన్న మార్క్సిస్టు సిద్ధాంత ప్రభావం అక్టోబరు విప్లవ ప్రారంభంలోనే తెలుగునాట ప్రసరించటం మొదలుపెట్టింది. తొలుత ఉద్యమాల కన్నా కూడా సాహిత్యపరంగానే ఎక్కువగా విస్తరించింది. ఆ వెలుగులోనే తెలుగునాట సాహిత్య, సాంస్కృతిక కళారంగాల్లో సమానత్వ సౌరభాలు గుభాళించాయి. చైతన్య బావుటాలు రెపరెపలాడాయి.ఉత్తేజపు గీతాలు ఉత్సాహ తరంగాలై ధ్వనించాయి, జ్వలించాయి.
అభ్యుదయం మన వారసత్వం
అభ్యుదయ ఆలోచనలకు అవకాశమిచ్చే సాహిత్య సృజన, సంఘ సంస్కరణ అక్టోబరు విప్లవానికి ముందు ఆంధ్రదేశంలో మొదలైంది. మహాకవి గురజాడ అందించిన దేశభక్తి గేయంలో, ముత్యాల సరాల గీతమాలికల్లో శ్రమకు, చైతన్యానికి ప్రాధాన్యమిచ్చే భావనలు చాలా స్పష్టంగా కనిపించాయి. 'నరుని చెమటను తడిచి మూలం ధనం పంటలు పండవలెనోరు..', 'ఎల్ల లోకము ఒక్క యిల్లై వర్ణబేధములెల్ల కల్లై ...' అంటూ మానవ శ్రమ ప్రాధాన్యాన్ని, విశ్వ మానవ ఏకత్వాన్ని గురజాడ ఆనాడే చాటిచెప్పారు. గురజాడ మరణానంతరం చాలా కాలం ఆయన రచనలు మూలనపడ్డాయి. తెలుగు నాట ఉన్న గొప్ప విశాల భావజాలాన్ని, అభ్యుదయ వారసత్వాన్ని వెలికితీసే పనిని కమ్యూనిస్టులే భుజాన వేసుకొని చేపట్టారు. ఫలితంగా గురజాడ, కందుకూరి రచనలు; వారి భావాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. 'మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును..' అన్న గురజాడ మాట ఇప్పటికీ శిరోధార్యమే! ప్రపంచంలోనూ, మనదేశంలోనూ పెచ్చుమీరుతున్న మతతత్వ ఉగ్రవాదానికి ఆచరణాత్మకమైన అడ్డుకట్ట 'మనిషి కేంద్రంగా ఉన్న జ్ఞానం'తోనే సాధ్యం. విశ్వంతరాల వరకూ విజ్ఞానం విస్తరించిన ఈకాలంలో.. పాలకులు అశాస్త్రీయ అజ్ఞాన భావజాలాన్ని పీఠమెక్కిస్తున్న వైనాన్ని నేడు మనం చూస్తున్నాం. ఇది సమాజ పురోగమనానికి ఎంతమాత్రం పనికిరాదు.
తొలి శ్రామిక గీతాలు
దయ, దానం, ధర్మం వంటి సంపన్నుల లక్షణాలే అట్టడుగు తరగతులను, ఆకలి గొన్న ప్రజలను కాపాడతాయన్న కాలం చెల్లిన కబుర్ల స్థానే- శ్రమపడేవాడికి సంపద ఒక హక్కు అన్న భావన, భరోసా మార్క్సిజం రూపంలో అందుబాట్లోకి వచ్చింది. శ్రమకు, సంపదకూ ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన, వివరించిన సిద్ధాంతంగా ఆనాటి చదువరులందరినీ ఆకట్టుకొంది. రష్యాలోనూ, ఇతరత్రా అరుణపతాకం సాధించిన విజయాలు యువతను ఉత్తేజపరిచాయి. ఆ ఉత్సాహంలోంచే తెలుగునాట తొలి అరుణపతాక గీతాలు పుట్టుకొచ్చాయి.
1935 పారిస్‌ ప్రపంచ రచయితల సదస్సు, 1936 లండన్‌లో రూపొందించుకున్న భారత అభ్యుదయ రచయితల ప్రణాళిక, 1936 ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో లక్నోలో జరిగిన అఖిల భారత రచయితల సంఘం సభలూ, 1938లో గరిమెళ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఆంధ్రాభ్యుదయ రచయితల సభలు... సాహిత్యకారులకు సరికొత్త ఉత్తేజాన్ని, స్పష్టమైన దృష్టినీ అందించాయి. తెలుగునాట అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్ర ప్రజానాట్యమండలి ఆ ఉరవడిని సాహిత్య, కళారంగాల్లో ప్రవహింపచేశాయి. 1938 అక్టోబర్లో గద్దె లింగయ్య సంపాదకత్వంలో తొలి ఎర్రజెండా గేయాలు 'క్రాంతి గీతాలు' పేరిట వెలువడ్డాయి.
'ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా
అదురు బెదురూ లేక అడ్డేదియు లేక
సామ్రాజ్యవాదంబు సమసిపోవంగ
ధనికవాదంబెల్ల దగ్ధమై పోవంగ' అని తుమ్మల వెంకటరామయ్య గీతం ఆ సంపుటిలో ఉంది. అందుబాట్లో ఉన్న సమాచారం మేరకు తెలుగులో వెలువడ్డ తొలి ఎర్రజెండా పాట ఇదే! ఇంకా ఇదే సంపుటిలో రైతుల గురించి శెట్టిపల్లి వెంకటరత్నం, గిరిరాజు రామారావు; కార్మికుల గురించి పెండ్యాల లోకనాథం రాసిన గీతాలు ఉన్నాయి. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం, యూజినీ పాటియర్‌ రచించిన అంతర్జాతీయ గీతానికి బాలాంత్రపు నళినీకాంతరావు అనువాదం కూడా ఆ సంపుటిలోనే ప్రచురించారు. ఇంకా గద్దె లింగయ్య, గరిమెళ్ల సత్యనారాయణ, వాసిరెడ్డి నాగేశ్వరరావు, మద్దూరి అన్నపూర్ణయ్య తదితరుల గీతాలు కూడా ఉన్నాయి. తెలుగునాట చాలా గ్రామాల్లో ఆ పాటలన్నీ కంఠోపాఠంగా మార్మోగుతూ ఉండేవి. కార్మిక, కర్షకుల్లో ఐక్యత, పోరాటతత్వం ప్రజ్వరిల్లటానికి ఆ పాటలు గొప్ప ఊపునీ, ఉత్తేజాన్నీ ఇచ్చాయి. ఒక చారిత్రక అవసరానికి ఉపయోగపడేలా రచయితలు దోహదపడ్డారు.
అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళికను ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంధాలయంలో చదివిన శ్రీరంగం శ్రీనివాసరావు అనే యువకుడు మరో ప్రపంచం వైపు తెలుగు కవిత్వ రథాన్ని మళ్లించాడు. అప్పటివరకూ కృష్ణశాస్త్రి ప్రభావంతో భావకవిత్వంలో తేలియాడుతున్న శ్రీనివాసరావుకి మార్క్సిజపు బీజంతోనే కొత్త పూనకం వచ్చింది. ప్రజలే ప్రాతిపదికగా, మార్పే అవసరంగా, చైతన్యమే ఆయుధంగా అతడు ప్రవహించిన కవిత్వం ఝంఝామారుతంలా తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఊపి పారేసింది! ఆ బలం మార్క్సిజం అనే మహాశక్తి వల్లే శ్రీశ్రీ కవిత్వానికి వచ్చింది. ఆ తరువాత ఒక పరంపరగా, ప్రభంజనంలాగా తెలుగు కవిత్వంలో, కథలో, నవలలో, నాటకంలో ఎర్రపతాక ధగద్ధగయమానంగా రెపరెపలాడింది.
అందరూ అభ్యుదయ రచయితలే!
రెండో ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధాన్ని నిరసిస్తూ, ప్రపంచశాంతిని కాంక్షిస్తూ రచయితలు, కళాకారులు ఎన్నో గీతాలు రాశారు. కళారూపాలు రూపొందించారు. శ్రీశ్రీ 'గర్జించు రష్యా గాండ్రించు రష్యా' అంటూ ఉత్తేజ గీతాన్ని అందించాడు. ఎంతోమంది రచయితలు ఎర్రజెండా విజయాన్ని కోరుతూ, గెలుపును కీర్తిస్తూ ... అది ప్రపంచ ప్రజలందరి విజయంగా అభివర్ణించారు. ఆంధ్రదేశంలో అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి సృష్టించిన ఉత్తేజపూరిత వాతావరణానికి ప్రభావితం కాని కవి, రచయిత ఒక్కరంటే ఒక్కరూ లేరని చెప్పటం అతిశయోక్తి కాదు. భావకవిత్వానికి చిరునామాగా చెప్పుకునే దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా అరుణతారను కీర్తిస్తూ రాశారు.
'ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార
ఏకాకి నిశీధి నొడుచు తరుణకాంతి ధార
జయపతాక! యువ పతాక! వియదాపగ వెడల నౌక'
అంటూ 1945 డిసెంబరు 31న రాజమహేంద్రవరంలో అరసం మహాసభల్లో ప్రారంభోపన్యాసం చేశారు. 'తరలిందదె ప్రజారథం- పొరలింది ప్రపంచ పథం.. వికసించే విధానమున మకుటధారి మానవుడని పదపద' అని మరొక గీతంలో ఎర్రజెండా అజెండాను ప్రశంసించారు. పుష్పవిలాప కవిగా పేరొందిన కరుణశ్రీ కూడా అరుణ పతాక ఔన్నత్వాన్ని కీర్తిస్తూ రాశారు.
'మా కండలు పిండిన నెత్తురు- మీ పెండ్లికి చిలికిన అత్తరు
మా ఇంట్లో కటిక చీకటి - మీ ఇండ్లను పట్టపగలు ఎలక్ట్రిసిటీ' అని ఆయన రాసింది అచ్చమైన కార్మికగీతం. జాషువా కూడా అనేక పద్యాల్లో శ్రామిక జనుల కష్టాన్ని కళ్లకు కట్టేలా వర్ణించారు.
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట కాలంలో- తెలుగు కవులూ రచయితలూ మరింత స్పష్టంగా ప్రజాపక్షం వహించారు. ప్రజలను ఉత్తేజపరిచే గీతాలూ గేయాలూ అందించారు. ఆ తరుణంలోనే ఎంతోమంది ప్రజాకవులు ఆవిర్భవించారు. ఉద్యమాలూ పోరాటాలూ... కవులను రచయితలను కళాకారులను సృజియిస్తాయనే మాటలకు ఆనవాళ్లు ఆ సందర్భాలు. కథ, కవిత్వం, గేయం, పాట, నవల, నాటకం ఆ సందర్భంలోనే సమరశీలతను సంతరించుకొని జనపక్షం వహించాయి. త్యాగాలకు, పోరాటాలకు అక్షరాభిషేకం చేశాయి. 'ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు' అని మనం ఇప్పటికీ గుర్తు చేసుకునే అనేక బలమైన, విలువైన మాటలు ఈ పోరాట సాహిత్యంలోంచి వచ్చినవే! సుద్దాల హనుమంతు, దాశరథి, మగ్దూం, కాళోజీ, యాదగిరి, వట్టికోట ఆళ్వారుదాసు, తిరునగరి, ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్‌, గంగినేని, సుంకర, కుందుర్తి, బెల్లంకొండ ... వంటి మహామహులంతా ఎర్రజెండా గీతాలను, కథలను ఇంతెత్తున ఎత్తిపట్టుకొన్నవారే!
ఇప్పుడు మరింత అవసరం!
ఆ తరువాతి తరాల రచయితలూ, కవులూ, కళాకారులూ ఎర్రజెండా ప్రభావంతో పుంఖానుపుంఖంగా సాహిత్యాన్ని వెలువరించారు. చైతన్యకేతనం గురించి గొప్పగా చాటిచెప్పారు. ప్రజలపై దోపిడీ, అణచివేత ఎప్పుడూ ఒకేరూపంలో ఉండవు. భూస్వామి - కూలీ అనే రూపం ఉన్నప్పుడు శ్రమదోపిడీని, అణచివేతనూ సులభంగా అర్థం చేసుకోవొచ్చు. సరళంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. పెట్టుబడి కొత్త రూపం తీసుకొని చూట్టానికి సున్నితంగా, సుందరంగా కనిపిస్తున్నప్పుడు- దాన్లోని దోపిడీని, పీడనను పట్టుకొని చూపించటం కొంత కష్టం. దానిని పట్టుకోవటానికి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మాటల వెనకా, చేతల వెనకా కప్పి ఉన్న అందమైన తెర వెనక గల లోగుట్టును గట్టిగా పట్టుకోవాలి. దానికి నైపుణ్య శైలితో సాహిత్య, కళారూపాల్లోకి మార్చాలి. ఆ అవసరం, బాధ్యతా ఎప్పటికన్నా ఇప్పుడు రచయితలూ, కవుల మీద చాలా ఎక్కువగా ఉంది. సమాజాన్ని అర్థంచేసుకొని అది ఇప్పటికన్నా రేపు మరింత మెరుగ్గా ఉండటానికి అవసరమైన దారులు చూపించటమే కర్తవ్యంగా మన ముందు తరాల సాహితీవేత్తలు చెప్పారు, పాటించారు. నేటి సామాజిక బంధాల్లో, సంపద పెరిగి కొందరి వద్ద పోగు పడడంలో, అత్యధిక జనం ఇంకా ప్రాథమిక అవసరాలకోసం నిత్యం దేవులాడ్డంలో, ఇదే సమయంలో కులమతోన్మాదాలు పెచ్చుపెరగటంలో ఉన్న రహస్య బంధాలను ఛేదించాలి. పాలకులు, పెట్టుబడి కలిసి ఉమ్మడి కనికట్టుతో దేశానికి, ప్రజలకు చేస్తున్న చేటునూ, చెడుపునూ చాటిచెప్పాలి. ఈ చారిత్రిక సందర్భం కవులకు, కళాకారులకు, రచయితలకూ ఇస్తున్న కర్తవ్యం ఇది! చైతన్యాన్ని పంచే సిద్ధాంతమూ, పతాకమూ ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటాయి. ఆ స్ఫూర్తిని, దీప్తినీ పెంచే సాహిత్యమూ, సంఘీభావమూ ఇంకా చాలా రావాల్సి ఉంది... చాలా చాలా ఉంది.
- సత్యాజీ