Jan 25,2021 21:27

న్యూఢిల్లీ బ్యూరో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతి ఏటా పోలీసులకు పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పోలీస్‌ పతకాలు తెలుగు రాష్ట్రాలకు భారీగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పలువురు పోలీస్‌ అధికారులకు ఈ పురస్కారాలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్‌ : 18 పోలీస్‌ మెడల్స్‌, ఒక రాష్ట్రపతి విశిష్ట సేవ, 2 గ్యాలంట్రీ పతకాలు, విశిష్ట సేవ కేటగిరీలో 15 మందికి పతకాలు వచ్చాయి. అవి కాకుండా ఏపికి చెందిన కలగర్ల సాహితికి రాష్ట్రపతి ఉత్తమ జీవన్‌ రక్ష పడక్‌ పతకం వరించింది. అలాగే ఎం. అరుణ్‌ కుమార్‌, అరిగెల రత్న రాజులకు సేవా పతకాలు వరించాయి.
తెలంగాణ : 14 పోలీస్‌ మెడల్స్‌, రాష్ట్రపతి విశిష్ట సేవ 2, విశిష్ట సేవ కేటగిరీలో 12 పతకాలు ప్రకటించారు. వీరిలో హైదరాబాద్‌ అదనపు సిపి శిఖా గోయల్‌కు, నిజామాబాద్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి ఉన్నారు.
ఆయా అధికారులు తమ విధుల్లో కనబర్చిన ప్రతిభకు ఈ పతకాలు దక్కాయి. పతకాలు పొందిన వారిని పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. త్వరలోనే వీరు పతకాలు స్వీకరించనున్నారు.