Feb 28,2021 12:06

సన్నగా, పొడవుగా సువాసనలు గుప్పించే తెల్లని విరితేజం లిల్లీ మనకు తెలుసు. వీటిని తోటలుగా పెంచి ఆ పూలను అలంకరణకు, పూలమాలలుగా, మగువల సిగలో తురుముకునే మాలలుగానూ కడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా లిల్లీలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం విరితోటలోకి తొంగిచూడాల్సిందే.

లిల్లీ పూలమొక్కలు ప్రపంచ వ్యాప్తంగా 110 రకాలు ఉన్నాయి. ఇవి లిలియం లిలియేసి కుటుంబానికి చెందిన అందమైన పూల మొక్కలు. ఇది ఉల్లి మాదిరిగా భూమిలో దుంప కలిగిన జాతి. ఆరు నెలల నుంచి ఏడాది సమయంలో మొక్క పెరిగి, పువ్వులు పూస్తుంది. ఆ మొక్క కాడ క్షీణించే దశలో దుంప నుంచి మరో మొక్క వస్తుంది. లిల్లీ పూల ఆకారం, పరిమాణం, పరిమళం వాటికవే సాటి. ప్రశాంతతకు, పవిత్రతకు ప్రతీకలుగా లిల్లీని చెప్తుంటారు. కాబట్టేనేమో 'పీస్‌'లిల్లీ అని పిలుస్తారు.

తెల్లని విరితేజాలు.. లిల్లీలు


స్పైడర్‌ లిల్లీ
సన్నని కాడ దూటలాగా ఎదిగి, దానికి చివర ఒక తెల్లని పువ్వు వస్తుంది. సన్నని మీసాల్లాంటి ఆరు పొడవాటి రేఖలు చాలా గమ్మత్తుగా కిందికి వాలుతూ ఉంటాయి. వాటి మధ్యభాగాన మరో సన్నని కేసరాలు పైకి ఉంటాయి. వాటికి చివర్లలో లేత పసుపురంగు పుప్పొళ్ళు ంటాయి. పువ్వు నాజూగ్గా, శ్వేత కాంతులు విరజిమ్ముతూ గాలికి ఊగుతుంటే ఎంతో రమణీయంగా ఉంటుంది. వీటిని ఆరుబయట కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు. ఆకుపచ్చని లాన్‌ (పచ్చిక బయళ్లు) మధ్యలో ఈ మొక్కలు నాటుకుంటే భలే అందంగా ఉంటాయి. మొక్కకి ఒకేసారి కాకుండా, ఒకదాని తర్వాత ఒకటి పువ్వులు పూయడం దీని ప్రత్యేకత.

తెల్లని విరితేజాలు.. లిల్లీలు


కరోనా లిల్లీ
ఇది కాస్త లావుపాటి కాండం వచ్చి, దానికి తొలుత ఓ మొగ్గ వస్తుంది. అది మరునాడు విచ్చుకుంటుంది. ఆ పువ్వు ఒక రోజులో వాడిపోతుంది. మరలా మొగ్గ తొడగడం, విచ్చుకోవడం జరుగుతుంది. పువ్వు ఎరుపు వర్ణంలో పెద్దగా ఉంటుంది. లోపల ఉండే పుప్పొడులు మీసాల్లా మరింత అందాన్ని అద్దుతాయి. శీతల దేశాల్లో, మనదేశంలో శీతాకాలంలో మరింత నిగారింపుగా ఉంటాయి. ఆరుబయట సెమీషేడ్‌ అంటే వెలుతురు ఉండే వరండా, పోర్టుకో, సిటౌట్ల (ప్రహరిలోపల)లో పెంచుకోవచ్చు.

తెల్లని విరితేజాలు.. లిల్లీలు


చిరుత లిల్లీ
పువ్వు నారింజ రంగులో ఉండి, వాటి మీద చిన్న చిన్న నల్లని మచ్చలతో ప్రత్యేకమైన డిజైన్లతో భలే ఉంటాయి. అందుకే దీనిని చిరుత లిల్లీ అంటారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఈ లిల్లీలు పెద్దగా వాసన ఉండవు. వీటిని కూడా డెకరేషన్‌కి వాడతారు. ఈ పూలకుండీలను ఆరుబయట, సెమీ షేడ్‌లోనూ పెంచుకోవచ్చు. ఎర్రమట్టిలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.

తెల్లని విరితేజాలు.. లిల్లీలు


ఈస్టర్‌ లిల్లీ
నిత్యం నాలుగు దిక్కుల వైపు నాలుగు పువ్వులు పూసేదే ఈస్టర్‌ లిల్లీ. ఈస్టర్‌ లిల్లీలో చాలా రకాలున్నాయి. అలాగే రంగులు కూడా ఉన్నాయి. పువ్వు విభిన్న డిజైన్లలో కొలువుదీరి చాలా ఆకట్టుకుంటుంది. కాండంతో సహా పువ్వుల ట్రిగ్‌ కత్తిరించి, కుండీల్లో అలంకరించడం వీటి ప్రత్యేకత. వీటిని ప్రత్యేకమైన ప్లాస్టిక్‌ సంచుల్లో కూర్చి, బొకేల్లా ఇస్తుంటారు. ఈస్టర్‌ పండగనాడు వీటిని కానుకలుగా ఇచ్చుకుంటారు.

తెల్లని విరితేజాలు.. లిల్లీలు


గుత్తి లిల్లీ
లావుపాటి కాండము, పొడవుగా పెరిగి దానికి చివర గుత్తులు గుత్తులుగా తెల్లటి పువ్వులు విరబూస్తాయి. సన్నని పొడవుగా ఉండే పూరేఖలు వెనుకవైపు వంపు తిరిగి కిందికి వాలి, పూలగుత్తి బొకేలా ఉంటుంది. పూలగుత్తి నెల్లాళ్ల వరకూ వాడిపోకుండా ఉంటుంది. అడుగు వైపు నుంచి పూరేఖలు వాడిపోతుంటే మధ్యలోంచి కొత్త రేఖలు పుట్టుకొస్తాయి. వీటి పూలకు ఉండే మీసపు పుప్పొళ్లే అందం. అన్ని లిల్లీలకు ఆకులు సన్నగా దూటకు అంటిపెట్టుకుని ఉంటాయి.

తెల్లని విరితేజాలు.. లిల్లీలు


ఆర్నమెంటల్‌ లిల్లీ
విభిన్న రంగులు, వివిధ రకాలు, అనేక డిజైన్లు కలిగిన ఫ్యాషన్‌ పూలమొక్కలు ఆర్నమెంటల్‌ లిల్లీలు. వీటిని కట్‌ ఫ్లవర్స్‌గా ఉపయోగిస్తారు. కాండము బూరలా లోపల గుల్లగా ఉంటుంది. వీటికి మిగతా మొక్కలకన్నా కాస్త ఎక్కువ నీటి వసతి కావాలి. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. విదేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది.
                                              * చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506