Apr 08,2021 20:01

ఫొటో : నిరసన తెలుపుతున్న తెల్లగుంట గ్రామస్తులు

ఫొటో : నిరసన తెలుపుతున్న తెల్లగుంట గ్రామస్తులు
తెల్లగుంట గ్రామంలో ఎన్నికల బహిష్కరణ
ఖాళీ బిందెలతో మహిళలు నిరసన
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం తెల్లగుంట గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఆ గ్రామస్తులు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను గురువారం బహిష్కరించి నిరసన తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మండల కార్యదర్శి కాకుమాను చిన్నవెంకయ్య, మండల కమిటీ సభ్యులు గడ్డం వెంకయ్య, తెల్లగుంట శాఖ సిపిఎం కార్యదర్శి కొప్పోలు రాములు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి కాకుమాని చిన వెంకయ్య, దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌ మల్లి మాట్లాడారు. మండలంలోని తెల్లగుంట గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా మంచినీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎన్నికల సమయంలో హామీనిచ్చి ఎన్నికల అనంతరం గ్రామాన్ని పట్టించుకునే నాయకుడు లేకుండా పోయారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాన్ని సమర్పించినా వారిలో చలనం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. గ్రామానికి ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ల కోసం ప్రభుత్వం తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా లక్షలు ఖర్చుపెట్టి తోలుతున్నారని రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ట్రాక్టర్ల యజమానులకు బిల్లులు ఆపడంతో నీటి సరఫరాను నిలిపి వేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఎంపిడిఒకు వినతి పత్రం ద్వారా తెలిపామని పంచాయతీ నిధులతో కొన్ని రోజుల వరకు నీటిని సరఫరా చేశారని, నీటి విడుదల విషయంలో నాయకులు గానీ, అధికారులు గానీ రాత రూపంలో హామీనిచ్చేంత వరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకొన్న కావలి ఆర్‌డిఒ శ్రీనివాసులు తెల్లగుంట గ్రామానికి వచ్చి హామీ పత్రం రాసి ఇవ్వడంతో నిరసన ఉపసంహరించుకొని ఎన్నికల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ బాలమురళికృష్ణ, ఎంపిడిఒ శివయ్య, ఆర్డబ్ల్యుఎస్‌ ఎఇ, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.