May 16,2021 08:15

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : తౌక్టే తుపాను ప్రభావం ఏపిలోని కొన్ని జిల్లాలపై ఉండనుంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు శనివారం రాత్రి వెల్లడించారు. ఆగేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 'తౌక్టే' వాయుగుండం ఉంది. ఇది కేరళ, కర్నాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి ఈనెల 16న ఆదివారం నాటికి తుపానుగా ఆ తర్వాత మరింతగా బలపడి తీవ్ర తుపానుగానూ మారనుంది. ఈ నెల 18 నాటికి గుజరాత్‌లోని పోర్‌బందర్‌ వద్ద తీరం దాటనుంది. మరోవైపు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో తేమ గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల వైపు విస్తరించనున్నాయి. కోస్తా, రాయలసీమల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 16వ తేదీ రాష్ట్రంలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.