Jul 25,2021 13:41

లాక్‌డౌన్‌ కాలం వెబ్‌ సిరీస్‌లకు బాగానే కలిసిసొచ్చిందని చెప్పొచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన కథలకు మాత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. అయితే తెలుగు వెబ్‌ ప్లాట్‌ఫాం అయిన ఆహా విభిన్నమైన సిరీస్‌లను అందిస్తోంది. సరిగ్గా ఆ కోవలోకే వస్తుంది అమలాపాల్‌, రాహుల్‌ విజరు కాంబినేషన్‌లో వచ్చిన 'కుడి ఎడమైతే' అనే వెబ్‌ సిరీస్‌. సమంతాతో 'యూ టర్న్‌' చిత్రాన్ని తీసిన పవన్‌కుమార్‌ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ట్రైలర్‌, టీజర్‌, పోస్టర్లతోనే అంచనాలు పెంచేసిన 'కుడి ఎడమైతే' టీం నెటిజన్లను మెప్పించేసింది. టైమ్‌ లూప్‌ అనే కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంది. అసలు టైమ్‌ లూప్‌ అంటే ఏమిటి..? దాని కథేంటి..? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే...!

కుడి ఎడమైతే - ఆహాలో (తెలుగు వెబ్‌ సిరీస్‌)
విడుదల తేదీ : జులై 16, 2021
నటీనటులు : అమలాపాల్‌, ఈశ్వర్‌ రచిరాజు, రాహుల్‌ విజరు, రవిప్రకాశ్‌
దర్శకుడు : పవన్‌కుమార్‌
నిర్మాతలు : టి.జి. విశ్వ ప్రసాద్‌,
వివేక్‌ కుచిబోట్ల
సంగీత దర్శకుడు : పూర్ణచంద్ర, తేజశ్వి

థలోకి వెళితే.. డెలివరీ బారుగా పనిచేసే అభి (రాహుల్‌ విజరు) నటుడిగా మారాలని కలలు కంటుంటాడు. దుర్గా (అమలాపాల్‌) ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. అయితే వీరిద్దరూ ఒకరి కలలోకి ఒకరు రావడం, ఆ కలలో జరిగిన విషయాలే నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అయితే టైమ్‌ లూప్‌ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. అంటే ఒకే రోజులో పదే పదే జీవించడం.. జరిగిన సంఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటాయి. అలా సిఐ దుర్గ, డెలివరీ బారు ఆది జీవితంలో 2020వ సంవత్సరం, ఫిబ్రవరి 29 పదే పదే రిపీట్‌ అవుతూ ఉంటుంది. అర్ధరాత్రి కాగానే ఈ ఇద్దరికీ ఏదో రకంగా ప్రమాదం జరుగుతుంది, చనిపోతుంటారు. మళ్లీ తెల్లారితే అదంతా కలలా మారిపోతుంటుంది. ఇలా ఆ ఇద్దరూ ఫిబ్రవరి 29లోనే గడుపుతుంటారు. ఈ క్రమంలో టైం లూప్‌ కాన్సెప్ట్‌ గురించి తెలుసుకున్న దుర్గ సిటీలో జరుగుతున్న వరుస కిడ్నాప్‌లను ఎలా అడ్డుకుంది? ఆది తన స్నేహితుడు ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేశాడు? అసలు ఈ దుర్గ, ఆది ఎలా కలుస్తారు? కలిశాక ఏం చేస్తారు? కలలో వస్తున్న వాటిని ఆధారంగా చేసుకుని ఆ ఇద్దరు కథను ఎలా మలుపు తిప్పారు? అసలు వీరిద్దరూ ఒకరి కలలోకి మరొకరు ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానమే 'కుడి ఎడమైతే'.
    'కుడి ఎడమైతే' చూస్తున్నంత సేపు తరువాత ఏం జరుగుతుంది? ఎలా టర్న్‌ తిరుగుతుంది? కిడ్నాపర్లను ఎలా పట్టుకుంటారు? అసలు వాళ్లు ఎలా కిడ్నాప్‌ చేస్తున్నారు? అనే అంశాలు మెదళ్లను తొలుస్తూనే ఉంటుంది. అయితే 'కుడి ఎడమైతే' మొదటి సీజన్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇందులో మొదటి ఎపిసోడ్‌ మొత్తం ఆది పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూపిస్తారు. ఇక రెండో ఎపిసోడ్‌ అంతా సిఐ దుర్గ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూపిస్తుంటారు.
     అలా వారికి జరిగిన విషయాలే జరుగుతుంటాయి.. మధ్యలో కొన్ని మార్చాలని ఆది ప్రయత్నిస్తే.. మొదటికే మోసం వస్తుంది. అలా ఈ ఇద్దరి జీవితంలో ఈ టైం లూప్‌ అనేది ఎన్నో మలుపులను తీసుకొస్తుంది. మధ్యలో పార్వతి అనే అమ్మాయి కేసు కూడా ఇంట్రెస్ట్‌ను కలిగిస్తుంది. కాకపోతే చూసిన సీన్లే పదే పదే చూడటం, అదే రిపీట్‌ అవుతూ ఉండటం కాస్త అసహనానికి గురయ్యే ఛాన్స్‌ ఉంది.
    మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లున్న ఈ సిరీస్‌లో వీక్షకుడు బోరింగ్‌ ఫీలయ్యే ప్రతిసారీ ఏదో ఒక కొత్త పాయింట్‌, మలుపును పెట్టడంతో సిరీస్‌ ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది. రామ్‌ విఘ్నేశ్‌ రాసిన కథకు, పవన్‌కుమార్‌ తెరకెక్కించిన విధానం కలిసొచ్చింది. మొత్తానికీ 'కుడి ఎడమైతే' అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఎసిపి హత్య కేసు, కిడ్నాప్‌ కేసు, పార్వతీ కేసుల చుట్టే 'కుడి ఎడమైతే' కథనం తిరుగుతుంది.
    ఇందులో మొదటి సీజన్‌లో కిడ్నాప్‌ గ్యాంగ్‌ పని పట్టేశారు. పార్వతీ కేసును కూడా పరిష్కరించారు. అయితే చివర్లో ఎసిపి హత్య కేసుకు సంబంధించిన ట్విస్ట్‌ అదిరిపోయింది. తన ప్రియుడైన ఎసిపిని తానే చంపేశానంటూ సీఐ దుర్గ చెప్పడంతో 'కుడి ఎడమైతే' ముగుస్తుంది. అలా మొత్తానికీ రెండో సీజన్‌ కూడా ఉంటుందనీ, అది అంతకుమించి ఉంటుందని చెప్పకనే చెప్పేశారు.
     దుర్గ పాత్రలో అమలాపాల్‌ నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఆమె నటన పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక గ్లామర్‌ పరంగానూ మంచి మార్కులే పడ్డాయి. ఆమె దర్యాప్తు సన్నివేశాలన్నీ చాలా బాగున్నాయి. రాహుల్‌ విజరు అన్ని ఎమోషన్స్‌నూ పలికించాడు. హీరో అవ్వాలనే కోరిక, ఫుడ్‌ డెలివరీ బారుగా చాలీచాలని జీతంతో జీవితాన్ని గడిపే సాధారణ యువకుడిగా ఆకట్టుకున్నాడు. భయంకరమైన కిడ్నాపర్‌గా రవిప్రకాశ్‌ మెప్పించాడు. ఇక మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.
     సాంకేతిక విభాగానికి వస్తే.. ఈ సిరీస్‌ యొక్క నిర్మాణ విలువలు అగ్రస్థానంలో ఉన్నాయి. బిజిఎం, సంభాషణలు అలరించాయి. నైట్‌ ఎఫెక్ట్‌ను ప్రదర్శించే కాస్ట్యూమ్స్‌, మేకప్‌, కెమెరా యాంగిల్స్‌ ఆకట్టుకున్నాయి. సంగీతం పరంగా పూర్ణచంద్ర తేజస్వి కొట్టిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మూడ్‌కు తగ్గట్టు ఉంది. అద్వైత గురుమూర్తి కెమెరా పనితనం కలిసొచ్చింది. దర్శకుడు పవన్‌కుమార్‌ కాన్సెప్ట్‌ బాగుంది.