Nov 25,2021 20:21

మన దేశంలోని అనేక పాఠశాలల్లో టాయిలెట్లు లేని కారణంగా అనేకమంది బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ఈ కారణంగా 'భద్రతాగౌరవం' అనే నినాదంతో ప్రముఖ శానిటరీ తయారీ సంస్థ హింద్‌వేర్‌ బాలికలందరినీ తిరిగి పాఠశాలలకు పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది. 'బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌' పేరుతో క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది. మరుగుదొడ్డి లేని కారణంగా ఏ ఆడపిల్లా తన విద్య అవకాశాన్ని వదులుకోవద్దనే సంకల్పంతో మెరుగైన సౌకర్యాలతో మెరుగైన ప్రపంచాన్ని సష్టించడానికి ప్రయత్నిస్తోంది.

ఉదయం తొమ్మిది గంటకు బడిగంట మోగింది. విద్యార్థులంతా తమ తరగతి గదుల్లోకి చేరారు. కాసేపటికి రిజిష్టరుతో వచ్చిన క్లాస్‌ టీచరు హాజరు మొదలు పెట్టారు. అబ్బాయిలు మాత్రమే హాజరు పలుకుతున్నారు. పరిశీలించగా తరగతి గదిలో ఒకవైపు మొత్తం ఖాళీగా ఉంది. విద్యార్థినులందరూ గైర్హాజరయ్యారు. గ్రామీణ భారతదేశంలోని అనేక పాఠశాలల్లో ఈ వాస్తవ ఘటనలు కన్పిస్తాయి. తరగతి గదుల్లో విద్యార్థినులు కనిపించకపోవడానికి సామాజిక ఒత్తిళ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, మౌలిక సదుపాయాల కొరత ప్రధాన కారణమని వివిధ అధ్యయనాలు నిర్ధారించాయి.

తరగతి గదుల్లో బాలికలు కనిపించట్లేదు అంటే ఆ పాఠశాలల్లో టాయిలెట్లు లేవనే అర్థం అని 2015లో ఎన్‌జిఒ సంస్థ దస్రా తన ప్రాజెక్టులో భాగంగా పరిస్థితిని వెల్లడించింది. భారతదేశంలో దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది బాలికలు యుక్త వయస్సు వచ్చిన తర్వాత పాఠశాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. అనేక పాఠశాలల్లో సరైన టాయిలెట్లు లేకపోవడం వల్ల ఈ సమస్య సంవత్సరాలుగా పునరావృతమవుతోంది.

దేశంలోని దాదాపు 23 శాతం గ్రామీణ పాఠశాలల్లో అపరిశుభ్రమైన, ఉపయోగించలేని మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే 11.5 శాతం బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవని 2019 పరిశోధనలో తేలింది. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్న పాఠశాలల్లో దాదాపు 10.5 శాతం తాళాలు వేయగా, 11.7 శాతం నిరుపయోగంగా ఉన్నాయి. ఈ అధ్వాన స్థితి బాలికల తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేయడమే కాకుండా, ఆ విద్యార్థినులు నెలసరి సమయంలో కనీసం ఐదు రోజులు తరగతులను కోల్పోయేలా చేస్తుంది. ప్రతి నెలా తరగతులను కోల్పోవడంతో ఎక్కువ మంది కోర్సును కొనసాగించలేక చదువు నుంచే తప్పుకుంటున్నారు.

ఈ పరిస్థితిని మరింత వెలుగులోకి తెచ్చేందుకు నవంబర్‌ 19న ప్రపంచ టాయిలెట్‌ దినోత్సవం సందర్భంగా ప్రముఖ శానిటరీవేర్‌ బ్రాండ్‌, హింద్‌వేర్‌ 'బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌' కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'హైజీన్‌ దట్‌ పవర్స్‌' ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ ప్రచారం, పాఠశాలల్లో తగిన పారిశుధ్య, మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా వారు కోల్పోయిన భవిష్యత్తును తిరిగి పొందేందుకు బాలికలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

''భారతదేశంలో బాత్రూమ్‌ పరిశ్రమలో అగ్రగామిగా, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సౌకర్యాలను నిర్మించే బాధ్యత మాపై ఉందని భావించాము. మా ప్రయత్నం గ్రామాల్లోని యువతులను శక్తివంతం చేయగలదని ఆశిస్తున్నాము. పరిశుభ్రత సాధికారతను వ్యాప్తి చేస్తూ దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలతో కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాము'' అంటున్నారు బ్రిలోకా లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ సోమనీ.

'బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌' క్యాంపెయిన్‌ ద్వారా బాలికల కోసం పాఠశాలల్లో పరిశుభ్రమైన పారిశుద్ధ్యాన్ని సులభతరం చేయడం మా లక్ష్యం. ఇది వారు ఎక్కువ కాలం విద్యను కొనసాగించడంలో సహాయపడుతుంది' అని అంటున్నారు బ్రిలోకా బాత్‌ బిజినెస్‌ సిఇఒ సుధాన్షు పోఖ్రియాల్‌. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో, హింద్‌వేర్‌ అనేక ఛానెళ్లలో మార్కెటింగ్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. షార్ట్‌ ఫిల్మ్‌లు, ఇతర మాధ్యమాల సహాయంతో సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రజలూ భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహిస్తోంది.