Jun 11,2021 09:18

బయటనుంచి వచ్చిన నాన్న ''ఈ సమస్యలతో వేగలేకపోతున్నాను'' అంటూ చికాకుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
''ఏమైంది నాయనా... ఎందుకంత చిరాకుగా ఉన్నావు'' అని అడిగాడు తాతయ్య. ''ఏమీ లేదు. అన్ని విషయాలూ మీకే కావాలి. ఏదో ఒక మూల కూర్చొని కాలక్షేపం చేసుకోకుండా అన్ని విషయాల్లోనూ దూరిపోడానికి ప్రయత్నం చేస్తారు'' అని చిరాకుపడ్డాడు నాన్న.
''మీ నాన్నకి ఏ పనీ లేకపోవడం వల్ల ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు '' అని అంది అమ్మ.
ఆ మాటలకు నాన్నమ్మ - తాతయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బాధపడ్డారు. తాతయ్యను చూసేసరికి జాలి కలిగింది మనవడికి.
ఒకరోజు మనవడు తన మాష్టారుతో ఇంట్లో తాతయ్య పడుతున్న మనో వేదన గురుంచి చెప్పాడు. మాస్టారు కాసేపు ఆలోచించి.. ''రేపటి నుంచి నువ్వూ, నీ స్నేహితులు రోజుకో జాతీయ నాయకుడు చరిత్ర రాసుకొని రావాలి. పెద్దల మాట పెరుగన్నం మూట అనే చిట్టి వ్యాసాలు కూడా రాసుకురావాలి'' అని అన్నారు.
పిల్లలంతా వెళ్లి తాతయ్యను బతిమిలాడి ''గాంధీ, భగత్‌సింగ్‌, బోస్‌, నెహ్రు, పటేల్‌, పుచ్చలపల్లి లాంటి వారితో ఆ పాత రోజులు, తన జీవిత పాఠాలు, రోజుకో జాతీయ నాయకుడు చరిత్ర, ఆయన అనుభవాలు, నీతి కథలు చెప్పించుకోసాగారు. తాతయ్య ద్వారా పిల్లలకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని నానమ్మ, నాన్న, అమ్మ ఆనందపడ్డారు.
 

- ఎం వి స్వామి
94415 71505