Sep 15,2021 21:07

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నేతల మధ్య వివాదం చెలరేగినట్లు బిబిసి తెలిపింది. అధ్యక్ష భవనంలో తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘని బరాదర్‌, కేబినెట్‌ సభ్యుని మధ్య వాదన జరిగిందని బిబిసి తెలిపింది. ఇటీవలి కాలంలో బరాదర్‌ బహిరంగంగా కనిపించకుండా పోయినప్పటి నుండి తాలిబన్‌ నాయకత్వంలో విభేదాలున్నట్లు వార్తల వస్తున్నాయి. బరాదర్‌, శరణార్దుల వ్యవహారాల శాఖ మంత్రి, హకాని నెట్‌వర్క్‌లో ప్రముఖుడైన ఖలీల్‌ ఉర్‌ రహమాన్‌ మధ్య వాడిగా, వేడిగా మాటల యుద్ధం జరిగిందని తాలిబన్‌ వర్గాలు బిబిసికి తెలిపాయి. వారి అనుచరుల మధ్య కూడా గొడవలు జరిగాయని తెలిపారు. ఆ వివాదం తర్వాత బరాదర్‌ కాబూల్‌ వదిలి కాందహార్‌కు వెళ్లిపోయారని చెప్పారు. కతార్‌లోని తాలిబన్‌ సీనియర్‌ సభ్యుడు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారని బిబిసి తెలిపింది. గత వారం చివరిలో ఈ వాగ్యుద్ధం చోటు చేసుకుందని పేర్కొంది. తాత్కాలిక ప్రభుత్వం రూపకల్పన, ఏర్పాటుపై కొత్త డిప్యూటీ ప్రధాని బరాదర్‌ అసంతృప్తిగా వున్నారని అందువల్లే ఈ వాదన జరిగిందని ఆ వర్గాలు చెప్పాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన ఘనత తాలిబన్లలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. తనవంటి వారు జరిపిన దౌత్యం కారణంగానే అంతా జరిగిందనేది బరాదర్‌ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, తాము జరిపిన పోరాటం వల్లనే ఇది సాధ్యమైందని హక్కాని గ్రూప్‌ సభ్యులు భావిస్తున్నారు. హకాని నేత సిరాజుద్దీన్‌ హకాని ప్రస్తుత కొత్త ప్రభుత్వంలో హౌం మంత్రిగా వున్నారు. తాలిబన్‌ ప్రముఖుల్లో ఒకరు, అందరికీ తెలిసిన బరాదర్‌ గత వారం నుండి ఒక్కసారిగా కనిపించడకుండా పోవడంపై అనేక వదంతులు వ్యాప్తి చెందాయి. ఆయన మరణించి వుంటారన్న పుకార్లు కూడా తలెత్తాయి. బరాదర్‌ కాబూల్‌ వచ్చి అందరికీ కనిపిస్తేనే ఈ వదంతులు ఆగుతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. కాగా, తాలిబన్‌ సుప్రీం కమాండర్‌ హైబతుల్లా అఖుండ్‌జాదా కూడా ఈ వదంతులపై నోరు మెదపడం లేదు.