Nov 27,2020 12:02

ఢిల్లీ: దేశంలో తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజులుగా 40వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... గురువారం దేశంలో 43,082 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల మార్కును దాటింది. ఎప్పటిలాగే క్రియాశీల కేసులు ఐదు లక్షలకు దిగువనే కొనసాగాయి. ప్రస్తుతం ఆ రేటు4.89 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 93.65గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే క్రియాశీల రేటులో పెరుగుదల కనిపించింది. రికవరీ రేటు తగ్గుముఖం పట్టింది. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి 492 మంది మరణించారు. దీంతో కలుపుకుని ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,35,715 మరణాలు సంభవించాయి. అలాగే నిన్న 11,31,204 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. మళ్లీ నెలరోజుల తర్వాత మహారాష్ట్రలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే 6,406 కేసులు బయటపడ్డాయి. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి.