Oct 25,2021 07:45
  • 1.80 లక్షల నీటి నమూనాల పరీక్ష
  • 3.5 శాతం నమూనాల్లోనే ఫ్లోరైడ్‌, ఇతర కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తింపు


ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించే బోరు బావుల్లో నీటి నాణ్యత గతం కంటే బాగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం వినియోగించే వివిధ రకాల నీటి వనరులకు అధికారులు ఇటీవల పరీక్షలు నిర్వహించగా, ఫ్లోరైడ్‌ తదితర కాలుష్య కారకాలు అతి తక్కువ చోట్ల ఉన్నట్లు స్పష్టమైంది. తాగునీటి అవసరాలకు ఉపయోగించే వనరుల్లోని నీటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్‌) అధికారులు ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా నిర్వహించిన నీటి నమూన పరీక్షల్లో తాగునీటిలో ఫ్లోరైడ్‌ తగ్గినట్లు గుర్తించారు. గతంతో పోల్చితే ఇతర కాలుష్య కారకాలు కూడా తగ్గాయని అంచనా వేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకూ ఆరున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ చోట్ల మొత్తం 1,80,608 నీటి నమూనాలకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. వాటిలో 6,432 నీటి నమూనాల్లో ఫ్లోరైడ్‌, ఇతర ప్రమాదకర కాలుష్యాలున్నట్లు గుర్తించారు. మొత్తం పరీక్షల్లో కేవలం 3.5 శాతం నీటి నమూనాల్లోనే కాలుష్య కారకాలు ఉన్నట్లు తేలింది. గతంలో వివిధ సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో 15 శాతానికి పైగా ఫ్లోరైడ్‌ వంటి కారకాలు ప్రమాదకర స్థాయిలో ఉండేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,432 చోట్ల కాలుష్య కారకాలను గుర్తించగా, వాటిలో 6,396 చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు కూడా పూర్తి చేసినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పెరగడం, సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల రాష్ట్రంలో కలుషిత నీటి జాడలు బాగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
 

                                                        ఎపిలో అధిక పరీక్షలు

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ముందే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,99,785 నీటి నమూనాలను సేకరించి వాటిలో 1,80,608 నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా లక్షన్నర నీటి నమూనాలకు మించి పరీక్షలు నిర్వహించలేదు. ఎపి తర్వాత 1.49 లక్షల నీటి నమూనాలను సేకరించి అందులో 1.26 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించి మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలోనూ, 1.42 లక్షల నీటి నమూనాలను సేకరించి, అందులో 1.23 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించి కేరళ మూడో స్థానంలోనూ ఉన్నాయి.