
ప్రజాశక్తి- సీతంపేట : గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వి.కళావతి, ఐటిడిఎ పిఒ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. గురువారం శంకరన్ సమావేశ మందిరంలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం ఎంపిడిఒలు, ఆర్డబ్ల్యుఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దగూడ, లోవగూడ కాలనీ, దాసుగుమ్మడ తదితర గ్రామాల్లో రక్షిత పథకాలు పూర్తి కాలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిని త్వరితగతని పూర్తి చేసి గిరిజనులకు తాగునీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. పిఒ మాట్లాడుతూ సోలార్ రక్షిత పథకాలు మరమ్మతులకు గురైతే డిడిఒలు, జెఇలు కలిసి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వాటికి సంబంధించిన పరికరాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. నాబార్డు నిధులు రూ.10 కోట్లతో 21 రక్షిత పథకాల పనులు మార్చి 31 నాటికి పూర్తి కావాలన్నారు. దీనిద్వారా వంశధార శుద్ధి జలం అందుతుందని అన్నారు. 398 సోలార్ పథకాలు ప్రతిపాదనలు పంపించామని, అవి మంజూరైతే ఏజెన్సీలో తాగునీటి సమస్య ఉండదన్నారు. పంచాయతీ స్థాయిలో బడ్జెట్ కచ్చితంగా ఖర్చు చేయాలన్నారు. ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 221 సోలార్ రక్షిత పథకాలు మంజూరైతే.. సీతంపేట మండలానికి 113 కేటాయించగా... 72 పూర్తయ్యాయని అన్నారు. పది ప్రోగస్లో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే అనుమతి తో 27 లేని గ్రామాలకు కేటాయిస్తామన్నారు. అంతకుముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఇఇ చంద్రశేఖర్ర్ డిఒ విజయరాజు, పొట్నూరు కోటిబాబు పాల్గొన్నారు.