Oct 26,2021 17:13

ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమికి అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా తన విశ్లేషణను ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు ద్వారా పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించిందన్నారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్‌  20-25 పరుగులు తక్కువ సాధించిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా షహీన్‌ అఫ్రిది విసిరిన అప్‌ఫ్రంట్‌ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు సరైన ఫుటవర్క్‌తో కనిపించలేదన్నాడు. పాక్‌ పేసర్‌ గంటకు 140కిమీ వేగంతో విసిరిన బంతులకు.. మన బ్యాట్స్‌మెన్‌ అందుకు తగ్గట్టు క్రీజులో లేరన్నాడు. మరోవైపు పాక్‌ జట్టు అవసరాలకు తగ్గట్టు బౌలింగ్‌ చేయించిందని, తమ బౌలర్లను కచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుందని సచిన్‌ వివరించాడు. అలాగే టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ మధ్య మ్యాచులు జరిగి చాలా కాలం అయింది. దీంతో ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని సచిన్‌ చెప్పుకొచ్చాడు. అందువల్లే టీమ్‌ఇండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిందని గుర్తుచేశాడు. సూర్యకుమార్‌ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడన్నాడు. అనంతరం కోహ్లీ, పంత్‌ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా అవసరమైనంత ధాటిగా ఆడలేదని అభిప్రాయపడ్డాడు. మరోవైపు పాక్‌ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్లు తీసి ఉంటే పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలోకి వెళ్లేవారని పేర్కొన్నాడు. భారత బ్యాటింగ్‌ సమయంలో పాకిస్థాన్‌ అదే చేసిందని స్పష్టం చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. ఇక పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ మెల్లిగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ టీమ్‌ఇండియాపై ఒత్తిడి తెచ్చారన్నాడు. సులువైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారని తెలిపాడు. అయితే, టీమ్‌ఇండియా కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని సచిన్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.