Sep 15,2021 20:03

న్యూఢిల్లీ : క్రీడా మంత్రిత్వశాఖ ప్రతి ఏడాది అథ్లెట్లకు అందజేసే జాతీయస్థాయి అవార్డులకు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 600 దరఖాస్తులను అథ్లెట్లు, కోచ్‌లు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఏడాది క్రీడాశాఖ ఖేల్‌రత్న, అర్జున ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులను అథ్లెట్లు, కోచ్‌లకు గుర్తింపుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కేవలం 400 దరఖాస్తులు మాత్రమే రాగా.. ఈసారి ఏకంగా 600మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అవార్డుల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ ఉన్నారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డుకోసం ఈసారి 35మంది దరఖాస్తు చేసుకోగా.. అర్జున అవార్డు కోసం రికార్డుస్థాయిలో 215 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక ద్రోణాచార్య లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు 100, ద్రోణాచార్య రెగ్యులర్‌ కేటగిరీకి 48 దరఖాస్తులు వచ్చాయి. ఇక ధ్యాన్‌చంద్‌ అవార్డుకోసం మంత్రిత్వశాఖకు 138 దరఖాస్తులు చేరాయి. రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 36 దరఖాస్తులను కార్పొరేట్ణ్‌, ఎన్‌జివో, ఇతరత్రా అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఖేల్‌రత్న అవార్డు గ్రహీతకు గత ఏడాది రూ.7.50 లక్షల నుంచి రూ.25లక్షలకు, అర్జున అవార్డు గ్రహీతకు రూ.10లక్షలనుంచి 15 లక్షలకు అందజేసే నగదుపు పెంపు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఖేల్‌రత్నకు దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువమంది పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించినవారే.