Sep 15,2021 20:00

న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లఖ్‌నవూలోని కంపెనీలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు, మీడియా వెల్లడించాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'దేశ్‌ కే మెంటార్స్‌' కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సోనూసూద్‌ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. దానికింద పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో రాజకీయాల్లో చేరడం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. మంచిపని చేయడానికి రాజకీయాల్లోనే చేరాల్సిన పనిలేదన్నారు. దానిపై స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు. కరోనా సమయంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూసూద్‌ రియల్‌ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దీంతో ఇప్పటికీ ఎంతో మంది సాయం కోసం ఆయన్ను ఆశ్రయిస్తూనే ఉన్నారు.