May 18,2021 22:31

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌

- ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి
- జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సూచన
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌:
 శ్యాంపిల్‌ సేకరణతో పాటు టెస్టింగ్‌ కూడా మరింత వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జెసి (రెవెన్యూ), ఇన్‌ఛార్జి కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి శ్యాంపిల్స్‌ సేకరణ, టెస్టింగ్‌, ఫీవర్‌ సర్వే, రిజల్ట్‌, షిఫ్టింగ్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, ఆక్సిజన్‌, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై కోవిడ్‌-19 కమిటీ అధికారులతో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫీవర్‌ సర్వే శ్యాంపిల్స్‌ సేకరణ, టెస్టింగ్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే శ్యాంపిల్స్‌ సేకరించి, లక్షణాలు ఉన్న వారిని ఐసోలేట్‌ చేసి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ అందించి వారి ఆరోగ్య స్థితిగతులపై పర్యవేక్షించాలన్నారు. పాజిటివ్‌ కేసు నమోదైతే వెంటనే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫీల్డ్‌ లెవల్‌లో పాజిటివ్‌ రోగులను వెంటనే షిఫ్టింగ్‌ చేయాలన్నారు. వివాహాలకు 20 మందిని మాత్రమే అనుమతించాలని ఆర్‌డిఒలకు సూచించారు. ఆక్సిజన్‌ టీం రాత్రింబవళ్లు పని చేస్తూ జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నారని, ఆక్సిజన్‌ ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే ఇవ్వాలని తెలిపారు. జిజిహెచ్‌లో జెర్మన్‌ హేంగర్ల తాత్కాలిక ఆస్పత్రి... ట్రాయేజ్‌ కోసం పెడుతున్నామన్నారు. అలాగే కర్నూలు, నంద్యాల టిడ్కో హౌసింగ్‌ కాలనీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు జెర్మన్‌ హేంగర్ల తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఆ పనులు వారంలోపు పూర్తయి సిద్ధంగా ఉంటాయని చెప్పారు. తాత్కాలిక ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఎపిఎంఐడిసి సదాశివ రెడ్డిని ఆదేశించారు. ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు ట్రీట్‌మెంట్‌ పొందుతుండగా వారి బంధువులు యోగక్షేమాలపై ఫోన్‌ చేస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితుల బంధువులు హాస్పిటల్‌కు ఫోన్‌ చేస్తే వారి ఆరోగ్యం, యోగక్షేమాలు తెలియజేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుమన్‌కు సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వారిని వెంటనే డిశ్చార్జ్‌ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టీం బాగా పని చేయడంతో ఆ టీమ్‌ అధికారులను అభినందించారు. జెసి (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ రామగిడ్డయ్య, కర్నూలు, ఆదోని ఆర్‌డిఒలు హరిప్రసాద్‌, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.