Jan 26,2021 00:53

సమావేశంలో మాట్లాడుతున్న జివిఎంసి కమిషనర్‌ సృజన

ప్రజాశక్తి - విశాఖపట్నం : స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021కు సర్వం సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబరులో జివిఎంసి ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా స్మార్ట్‌ సిటీలో భాగంగా రోడ్ల ఇరుపక్కల తవ్వుతున్న పనులను పూర్తయిన వెంటనే డెబ్రిస్‌ను తీయించాలని, రోడ్లపై ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి, కాలువలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. పబ్లిక్‌ ప్రదేశాల్లో క్లీనింగ్‌తో పాటు, ఫాగింగ్‌ చేయించాలన్నారు. మహిళల్లో అవగాహన పెంచి కనీసం 50వేలు గృహాల్లో హోమ్‌ కంపోస్టు తయారు చేయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాళీ స్థలాలు ఉన్న చోట్ల పిచ్చి మొక్కలు, నీరు నిల్వ లేకుండా చూడవలసిన బాధ్యత ఆ స్థల యజమానిదేనని, స్పందించకుంటే అపరాద రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం.వెంకటేశ్వరరావు, సిసిపి విద్యుల్లత, సిఎంఓహెచ్‌ కెఎస్‌ఎల్‌జి.శాస్త్రి, ఎడిహెచ్‌ఎం దామోదరరావు, పి.డి.(యు.సి.డి) వై.శ్రీనివాసరావు, డి.సి. (రెవెన్యూ) ఎ.రమేష్‌ కుమార్‌, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ అఫీసరు డి.శ్రీనివాస్‌, అన్ని జోన్ల పర్యవేక్షక ఇంజినీరులు, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్‌) చిరంజీవి పాల్గొన్నారు.