Nov 28,2020 01:14

మాట్లాడుతున్న కమిషనర్‌ డాక్టర్‌ సృజన

విశాఖపట్నం : 2021 సంవత్సరానికిగాను స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో మెరుగైన ర్యాంకు సాధనకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధం కావాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం, ఆమె తన ఛాంబరులో జివిఎంసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో సర్వే బృందం ఏయే అంశాలపై తనిఖీ చేస్తారో అందుకు కావలసిన విధంగా డాక్యుమెంటు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో 6,000 మార్కులు ఉంటాయని, అందుకు అనుగుణంగా ప్రతి విభాగపు ప్రధాన అధికార్లు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ పనులన్ని డిసెంబరు 15 లోగా పూర్తిచేయాలన్నారు. అదనపు కమిషనర్‌ వి.సన్యాసి రావు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వివిధ కేటగిరీల కింద కేటాయించిన మార్కులను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఉన్నతాధికారులకు వివిరించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రధాన ఇంజినీరు ఎం.వెంకటేశ్వరరావు, సిసి పి.విద్యుల్లత, చీఫ్‌ మెడికల్‌ అఫీసరు డాక్టర్‌ కెఎస్‌ఎల్‌జి.శాస్త్రీ, పిడి (యు.సి.డి) వై.శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఎడి ఎం.దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసరు పాల్గొన్నారు.