
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : స్వాతంత్రోద్యమ ఘటనలను సందేశాత్మకంగా తెరకెక్కించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. 1909లో బ్రిటిష్ వారిపై తెనాలి ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య వీరోచిత గాధను తెనాలికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన వీరస్థలి తెనాలి లఘుచిత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.సుజాత బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం పార్ట్2ను క్లాప్ కొట్టి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేతంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా పలువురు యువకళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. చిత్రం యూనిట్‌తో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. చిత్రం యూనిట్‌ను ఆయన అభినందించారు. రత్నాకర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించారని, వారి త్యాగాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నమే చిత్ర రూపకల్పనగా వివరించారు. కార్యక్రమంలో అరవింతో సంస్థల ఉపాధ్యక్షులు మండల శ్రీరామ్‌కుమార్; అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి, డాక్టర్ జీవనలత, పొన్నూరు యార్డు చైర్మన్ బి.వీరప్రసాద్ పాల్గొన్నారు.