Jun 03,2021 13:33

న్యూఢిల్లీ : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) సూచీలో 2020-21గానూ కేరళ తన తొలి స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. బీహార్‌ ఈ సూచిలో అత్యంత చెత్త ఫెర్మాఫర్‌గా నిలిచింది. ఈ ఫలితాలను నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ గురువారం విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిమితులపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతిని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక అంచనా వేస్తుంది. 75 పాయింట్లతో తొలి స్థానాన్ని కేరళ కైవసం చేసుకోగా... హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు ఒక్కొక్కటి 74 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 72 పాయింట్లలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు,  ఆ తర్వాత గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచీలో బీహార్‌, జార్ఖండ్‌, అసోం రాష్ట్రాలు అత్యంత పేలవమైన పనితీరును కనబర్చాయి. కాగా, భారత్‌లో ఇవి మూడవ ఎస్‌డిజి సూచీ ఫలితాలు. నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఎస్‌డిజి భారత్‌ సూచీ, డాష్‌బోర్డ్‌ ద్వారా ఎస్‌డిజిలను పర్యవేక్షించే తమ ప్రయత్నాలకు విస్తృతంగా గుర్తింపును వచ్చిందని, ప్రశంసలందుకున్నట్లు తెలిపారు.
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను ప్రామాణికంగా తీసుకుని వివిధ రాష్ట్రాల పనితీరు, అభివృద్దిని నీతి అయోగ్‌ పరిశీలిస్తోంది. ఈ వివరాలను సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2018 పేరిట నివేదిక రూపంలో ప్రతి ఏడాది వెల్లడిస్తుంది. ఈ సూచీ ఎస్‌డిజిలపై పురోగతిని పర్యవేక్షించే ప్రాథమిక సాధనంగా మారింది. ప్రపంచ లక్ష్యాలపై వీటికి ర్యాకింగ్స్‌ను ఇవ్వడం ద్వారా ఏకకాలంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీని పెంచినట్లైంది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మళ్లీ కేరళనే టాప్‌
సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి?
పర్యావరణానికి విఘాతం కలిగించకుండా చేపట్టే ఆర్థికాభివృద్ధినే సుస్థిరాభివఅద్ధి అంటారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు 2015 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కేంద్రంగా 193 దేశాలు ఆమోదం తెలిపాయి. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో నిర్దేశించుకున్న 2018లో తొలి ఎడిషన్‌లో 13 లక్ష్యాలు ఉండగా.. ఆ తర్వాత ఎడిషన్‌కు 17, తాజా మూడవ ఎడిషన్‌కు కూడా 17 లక్ష్యాలు నిర్ధేశించారు. 2030 నాటికి 17 లక్ష్యాలు, 169 నిర్ధేశిత లక్ష్యాలను ప్రతి దేశం సాధించాలి. భారత్‌ ప్రభుత్వం నీతిఆయోగ్‌ పర్యవేక్షణలో ఇవే లక్ష్యాలను ఆధారంగా చేసుకొని వివిధ రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తోంది.