Nov 20,2020 12:19

 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బుకర్ అవార్డు స్కాట్ ల్యాండ్ కు చెందిన డగ్లస్ స్టువార్ట్ ను వరించింది. డగ్లస్ రాసిన తొలి నవల 'షుగ్గీ బియాన్'కు ఈ గుర్తింపు లభించింది. 1980వ దశకంలో ఓ ఉద్యోగ బాధ్యతల్లోని కుటుంబం, వారి చిన్నారుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో స్టువార్ట్ ఈ నవలను రాశారు. ప్రస్తుతం న్యూయార్క్ లో నివాసముంటున్న డగ్లస్ స్టువార్ట్...  తనకు అవార్డు లభించిందని తెలిసిన తరువాత  స్పందిస్తూ, "నేను ఓ రచయితగా గుర్తింపు పొందాలని ఎన్నో కలలు కన్నాను. నా కోరిక నెరవేరింది. ఈ బహుమతి నా మొత్తం జీవితాన్నే మార్చి వేసింది" అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు.

ఇక స్టువార్ట్ నవలలో తన స్వీయ అనుభవాలను కూడా జోడించారు. మద్యానికి బానిసైన తల్లి... తన అలవాట్లతో అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం, పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రేమను కోరుకుంటారు వంటి  భావోద్వేగ సన్నివేశాలను మనసుకు హత్తుకునేలా రాశారు. తన జీవితంలో ఎన్నో బాధలను అనుభవించానని, ఈ పుస్తకం తన బాధల నుంచి విముక్తిని కలిగించిందని డగ్లస్ తెలిపాడు. ఈ బహుమతి ద్వారా 66 వేల డాలర్లను డగ్లస్ అందుకోనున్నారు.  అయితే,  డాలర్ల కంటే కూడా  అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు రావడమే  పెద్ద బహుమతి అని  డగ్లస్ వ్యాఖ్యానించారు.