May 04,2021 07:28

''ఒరే! ఈ రోజు ఉదయాన్నే మూడు సార్లు తుమ్మేను. కొంపదీసి ఆ కరోనా గాని తగులుకుందంటావా ?'' అని ఫోను చేసి తన మిత్రుడు రామ శర్మని అడిగేడు. అప్పయ్య శాస్త్రి. ఆ రామశర్మకి అప్పయ్య శాస్త్రి మీద కోపంగా ఉంది. వద్దన్నా వినకుండా కుంభమేళా కి వెళ్ళి రావడమే కాకుండా మోడీని, తీరథ్‌ సింగ్‌ ని తెగ పొగుడుతూ రెండ్రోజులుగా విసిగించేస్తుంటే ఆ మాత్రం కోపం రాదూ ? ఆ కోపం మీద ''నన్నడుగుతావెందుకు? పోయి మీ తీరథ్‌ సింగ్‌నే అడుగు! '' అని ఫోను పెట్టేశాడు.
    అప్పయ్య శాస్త్రులు గారికి ఆరోజు తెల్లారిన దగ్గర్నించీ మనసు మనసులో లేదు. ఏదో గాభరాగా ఉంది. అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోతున్న ఫీలింగ్‌ వస్తోంది. ఉదయం దంతధావనం చేసిన తర్వాత మూడు సార్లు తుమ్మేడు మరి. మొదటిసారి 'చిరంజీవ' అని తనకి తానే అనుకున్నాడు. రెండోసారి తుమ్మినప్పుడు అలా అనుకోవడం మరిచిపోయి భయపడడం మొదలెట్టాడు. మూడోసారి తుమ్ము రాగానే చిరంజీవ అనుకోవడం బదులు 'కరోనా' అన్నాడు. ''ఇదేవిుట్రా భగవంతుడా ! నానోట ఇలా పలికించేవు ? '' అనుకుంటూ లోపలికి వచ్చేడు. మంచం మీద కూలబడ్డాడు.
ఈపాటికి భార్య సుబ్బమ్మ వచ్చి '' ఏవిుటి ? ఇంకా స్నానం చెయ్యలేదు ? పూజకి ఎప్పుడు కూచుంటారు ? ఇంతకీ ఈ రోజు ఫలహారం ఏం చెయ్యమంటారు ?'' అనడిగింది. అసలే టెన్షన్‌ లో ఉన్నాడేమో ఒక్కసారి '' నా పిండాకూడు వండు ! '' అని గట్టిగా అరిచేడు.
'' ఇది మరీ బాగుంది, మీ పిండాకూడు వండే పని కూడా నాకే అప్పజెప్తారా ఏవి!టీ?'' అని సణుక్కుంటూ వంటగది లోకి పోయింది.
అరగంట గడిచింది. అప్పయ్య శాస్త్రి నుంచి ఉలుకూ లేదు, పలుకూ లేదు. మంచంమీద వెల్లకిలా పడుక్కుని గుడ్లు తేలేసి అలానే పైకప్పుకేసి చూస్తూ ఉండిపోయాడు.
''నాకేవిుటి ? ఈ ముదనష్టపు కరోనా రావడం ఏవిుటి ? మొన్ననే గద ! హరిద్వార్‌ వెళ్ళి ఆ కుంభమేళాలో ముమ్మారు గంగాస్నానం చేసేను. పంచ మహా పాతకాలూ దాంతో పటాపంచలైపోయాయి కదా! పైగా గంగ నీరు మహా పవిత్రం! ఏ రోగాలూ అంటవని కదా అక్కడ కలిసిన కాశీ పండితులు ఘట్టిగా నొక్కి చెప్పేరు! మరిలా అయిందేవిుటి చెప్మా?'' అని లోపల్లోపల గింజుకుంటున్నాడు.
ఆ సరికి సుబ్బమ్మ మళ్ళీ వచ్చి మొగుణ్ణి కదలెయ్యబోయింది. అప్పయ్య శాస్త్రులు ఉన్న పొజిషన్‌ చూసేసరికి అనుమానం వచ్చింది. కొంపదీసి నిజంగానే పిండాకూడు వండమని తనకి చెప్పి ఆ ఊపిరి కాస్తా వదిలీసేడా అన్న సందేహం కూడా వచ్చింది. ఒక్కసారి ఘొల్లుమంది. ''ఓరి నా దేవుుడా ! ఎంత పని చేసేవురా భగవంతుడా ! '' అంటూ రాగాలు తీసింది. ఆ ఏడుపులకు దిగ్గున లేచి కూచున్నాడు అప్పయ్య శాస్త్రి. ''ఓసి నీ అఘాయిత్యం కూల! ఆ ఏడుపులాపు !'' అని కసిరేడు. సుబ్బమ్మ నోరు బంద్‌.
''ఒరే! ఈ రోజు ఉదయాన్నే మూడు సార్లు తుమ్మేను. కొంపదీసి ఆ కరోనా గాని తగులుకుందంటావా ?'' అని ఫోను చేసి తన మిత్రుడు రామ శర్మని అడిగేడు. అప్పయ్య శాస్త్రి.
ఆ రామశర్మకి అప్పయ్య శాస్త్రి మీద కోపంగా ఉంది. వద్దన్నా వినకుండా కుంభమేళా కి వెళ్ళి రావడమే కాకుండా మోడీని, తీరథ్‌ సింగ్‌ ని తెగ పొగుడుతూ రెండ్రోజులుగా విసిగించేస్తుంటే ఆ మాత్రం కోపం రాదూ ? ఆ కోపం మీద ''నన్నడుగుతావెందుకు? పోయి మీ తీరథ్‌ సింగ్‌నే అడుగు! '' అని ఫోను పెట్టేశాడు.
ఫోనులో భర్త మాట్లాడిన విషయాన్ని విన్న సుబ్బమ్మ మెల్లిగా '' పోనీ, వీధి చివర కాంపౌండరు మస్తాన్‌ సాయిబు ని పిలవనంపనా ? '' అనడిగింది.
మస్తాన్‌ సాయిబుని ఏ మొహం పెట్టుకుని అడగగలడు ? నాలుగు నెలల క్రితమే కదా, కరోనా రావడానికి చైనా వాళ్ళూ, ఆ రోగం ఇండియా అంతటా వ్యాపించడానికి తబ్లిగి జమాత్‌ సాయిబులూ కారణం అని గట్టిగా మస్తాన్‌ సాయిబుని నలుగురి ముందూ ఎడా పెడా వాయించింది తానే కదా . అందుచేత వద్దని అడ్డంగా తల వూపేడు.
''పక్కింట్లో అవధాన్లు గారున్నారేమో ఒక్కసారి వచ్చి వెళ్ళమని అడుగు'' అని మెల్లగా అన్నాడు. సుబ్బమ్మ పిలవడానికి వెళ్ళింది.
''మా నాన్నగారు లేరండీ. ఏంకావాలో నాకు చెప్పండి. నేను చేయగలిగిందైతే చేస్తాను'' అంటూ అవధాన్లు కొడుకు సూర్యం వచ్చేడు. ఇతగాడు సురేకారం లాంటివాడు.
అప్పయ్య శాస్త్రి సంగతి బాగా తెలిసిన వాడు.
''మరేం లేదు బాబూ ! ఆయనకి కరోనా వొచ్చిందేమో అని అనుమానంగా ఉంది.'' అంటూ విషయాన్ని బైట పెట్టింది సుబ్బమ్మ.
''కరోనా వచ్చిందో లేదో పరీక్ష చేయిస్తే విషయం తేలిపోతుంది కదా '' అన్నాడు సూర్యం. కుంభమేళా కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పయ్య శాస్త్రి గత రెండు రోజులుగా సాగిస్తున్న ఆర్భాటం అతగాడి చెవుల్లోనూ పడింది.
ఇప్పుడు అప్పయ్య శాస్త్రి పని మింగలేక, కక్కలేక అన్నట్టు ఉంది. పరీక్ష చేయించుకుంటే తన కుంభమేళా ప్రచారం అంతా వొట్టి హంబగ్‌ అని అందరికీ తెలిసిపోతుంది. పరీక్ష చేయించుకోకుండా ఉంటే ఈ కరోనా కొంప ముంచుతుందేమోనన్న భయం పీకుతోంది.
'' ఆ పరీక్షలూ గట్రా లేకుండా వేరే దారి ఏదో ఒకటి చూస్తావనే కదా నిన్ను రప్పించింది'' అన్నాడు.
''అలాగంటారా, వేరే దారి ఉంది. మీకు బాగా తెలిసిన దారే. మరి చేస్తారా?'' అని సూర్యం అడిగాడు. ''నాయన్నాయన! చచ్చి నీ కడుపున పుడతాను గానీ, అదేంటో చెప్పి పుణ్యం కట్టుకో బాబూ'' అంది సుబ్బమ్మ.
''మరేం లేదండీ, మీ పెరట్లో ఆవు ఉంది కదా, దాని మూత్రం ఓ చెంబుడు పట్టండి. దాన్ని తెచ్చి గంట గంటకీ ఆయనకి పట్టండి. మీరు దీపం వెలిగించి గట్టిగా చప్పట్లు కొట్టండి. మొన్న మీ ఆయన అందరికీ అమ్మేడు కదా ఆ రామ్‌దేవ్‌ బాబా మందు ! అదేనండీ, కరోనిల్‌ ! ఆ మందుని ఆయనకి ముప్పూటలా పట్టించండి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటే పెరట్లోకి తీసికెళ్ళి మీ ఆవు మొహం దగ్గర మీ ఆయన మూతి పెట్టండి. దెబ్బకి కరోనా మటుమాయం అవడం ఖాయం.'' అన్నాడు సూర్యం.
సుబ్బమ్మ గారికి బోలెడు డౌట్లు వచ్చేశాయి. ''ఏ టైం లో పోసిన గో మూత్రం పట్టాలి? ఒకసారి ఎన్ని చెంచాల మూత్రం ఇవ్వాలి? అందులో కాస్తంత పంచదార, ఏలక్కాయ వంటివి తగిలించవచ్చా ? ఆవు మొహం దగ్గర ఈయన ముఖం పెట్టినప్పుడు అది ఒకవేళ నాకితే ఏమౌతుంది? ''
ఈ సందేహాలన్నింటినీ సూర్యం దగ్గర తీర్చుకునే ప్రయత్నంలో సుబ్బమ్మగారు నిమగమై ఉంది. అప్పయ్య శాస్త్రికేమో కరోనా బాధ కన్నా ఈ సూర్యం బాధ, అంతకన్నా సుబ్బమ్మ సందేహాల బాధ ఎక్కువైపోయింది.
ఈ లోపు దేవుుడిలా కనిపించేడు మస్తాన్‌ సాయిబు. గట్టిగా కేకేసి పిలిస్తే రోడ్డుమీద పోతున్న వాడు కాస్తా గుమ్మం దాకా వచ్చేడు. తన బాధ మొత్తానికి చెప్పుకున్నాడు అప్పయ్య శాస్త్రి.
''మీరు చెప్పినదానిని బట్టి చూస్తే కరోనా అని అప్పుడే నిర్ధారణకి వచ్చెయ్యలేము శాస్త్రులు గారూ! రేపొకసారి ఆస్పత్రికి వస్తే పరీక్ష చేస్తాం. రిజల్టు వచ్చాక కరోనా అని నిర్ధారణ అయితే ట్రీట్‌మెంటు ఇస్తాం. ఈ లోపు మీరు రెండు పూటలా పసుపు నీళ్ళు ఆవిరి పట్టండి. నిమ్మరసం తీసుకోండి. బాగా ఊపిరి పీల్చి వదులుతూ ఓ పావుగంట వ్యాయామం చేయండి. ఇక మాస్కూ, శానిటైజరూ వాడడం గురించి వేరే చెప్పక్కరలేదు కదా.'' అన్నాడు.
అప్పయ్య శాస్త్రి కి గుండెల మీంచి కొండంత బరువు దించినట్టైంది. మస్తాన్‌ సాయిబుకి ధన్యవాదాలు చెప్పబోతుంటే సూర్యం ''మస్తాన్‌ గారూ ! ఆ తబ్లిగీ జమాత్‌ అంటే ..'' అంటూండగానే గబుక్కున సూర్యం నోరు మూసి పక్కకి తీసికెళ్ళి ''నాయనా! నీకు దండం. చచ్చిన పామునింకా చంపకు. మళ్ళీ ఆ కుంభమేళా గురించి గాని, తీరథ్‌ సింగ్‌ గురించి కాని, గోమూత్రం గురించి కాని, మోడీ గురించి కాని నోరెత్తితే చెప్పుచ్చుకు కొట్టు. ఇప్పుడు మాత్రం ఏవీ! మాట్లాడకు!'' అన్నాడు అప్పయ్య శాస్త్రి.
అదంతా మస్తాన్‌ సాయిబుకి వినపడనే వినపడింది. లోలోపల నవ్వుకుంటూ ''రేపు ఉదయం తొమ్మిదో గంటకల్లా రెడీ గా ఉండండి శాస్త్రులు గారూ ! టెస్టుకి తీసికెళ్తాను. '' అంటూ గుమ్మం దిగాడు.
ఆనందంతో ''జై మోడీ'' అనబోయి నాలిక్కరుచుకున్నాడు అప్పయ్య శాస్త్రి.
సుబ్బమ్మగారి సందేహాలు తీర్చకుండానే సూర్యం ఎందుకు వెళ్ళిపోయాడో ఆవిడకు ఇప్పటికీ అర్ధం కాలేదు మరి !