Sep 17,2021 23:04

సిబ్బందితో సమీక్షిస్తున్న కలెక్టర్‌, రూరల్‌ ఎస్పీ, ఇతర అధికారులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఏప్రిల్‌ 8వ తేదీన జరిగిన జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. వివిధ పట్టణాల్లో ఏర్పాటుచేసిన 14 ప్రాంతాల్లోని 47 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర త్వరలో శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికారులతో ఓట్ల లెక్కింపుపై సమీక్షించారు. ఎన్నికల కమిషన్‌ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లెక్కింపు సిబ్బంది, కేంద్రాల పర్యవేక్షకులు, ఇతర సిబ్బందికి శిక్షణిచ్చారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
జిల్లాలో 57 జెడ్‌పిటిసి స్థానాలు ఉండగా కోర్టు కేసులు, ఇతర కారణాలతో మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు జెడ్‌పిటిసి స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేశారు. మిగిలిన 54 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయగా గతేడాది మార్చిలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియలోనే 8 స్థానాలను వైసిపి ఏకగ్రీవంగా గెలుచుకుంది. శావల్యాపురం జెడ్‌పిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి హైమరావ్‌ పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు మరణించారు. దీంతో ఆ స్థానానికి ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 45 జెడ్‌పిటిసి స్థానాలకు 192 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
54 మండలాల పరిధిలో ఎంపిటిసి స్థానాలు 862 కాగా కోర్టు కేసులు గ్రామాల విలీనంతో 57 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 805 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా అందులో 226 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 579 స్థానాలకు గాను వివిద పార్టీల కు చెందిన 8 మంది అభ్యర్ధులు మతి చెందారు. దీంతో జిల్లాలో 571 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో మొత్తం 47 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 571 స్థానాల పరిధిలో మొత్తం 20,11,165 మంది ఓటర్ల కి గాను ఏప్రిల్‌ 8 న జరిగిన పోలింగ్‌ లో 11,51,616 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారీ భద్రత ఏర్పాట్లు : రూరల్‌ ఎస్పీ
ఓట్ల లెక్కింపు దష్ట్యా మూడంచెల బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మూడంచెల భద్రతా ఏర్పాటు చేస్తున్నామని, ముందస్తుగా స్ట్రాంగ్‌ రూములు కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్న ప్రదేశాలను గుర్తించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగడానికి తగినంత మంది సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారీకేడింగులను పకడ్బందీగా ఆయా శాఖల అధికారుల సమన్వయముతో ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బందిని మూడు భాగాలుగా విభజించి, భద్రత ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద గస్తీ నిర్వహణకు పెట్రోలింగ్‌ బృందాలను, పోలింగ్‌ కేంద్రాల వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసే బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు సత్వరనే స్పందించడానికి స్ట్రైకింగ్‌ పార్టీలు ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్‌ పార్టీలతో గస్తీ నిర్వహిస్తూ, ప్రజలు గుంపులుగా గుమికూడకుండా చూడాలని,స్టాటిక్‌ పార్టీ సహాయంతో అనుమతి లేని వారిని, అనుమానిత వ్యక్తులను పోలింగ్‌ కేంద్రాలలోనికి ప్రవేశించకుండా పర్యవేక్షించాలని చెప్పారు. విధులు నిర్వర్తించే వారికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల లోపలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న ఆయా పార్టీల ఏజంట్లకు ఎన్‌వోసి పత్రాలు జాప్యం లేకుండా మంజూరు చేయాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీస్‌ శాఖ తరపు నుండీ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు పరచాలని, సెక్షన్‌ 144 కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులు తప్పనిసరిగా బాడీవోర్న్‌ ధరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించొద్దని చెప్పారు. కోవిడ్‌ నిబంధనల అమలు దృష్ట్యా ఉరేగింపులకు అనుమతులు లేవని, ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.