Oct 28,2021 20:17

స్టెన్సిలింగ్‌ ఆర్ట్‌ అనేది ఓ దృశ్య కళ. కార్డ్‌బోర్డ్‌ లేదా ప్లాస్టిక్‌, లోహానికి చెందిన పలుచని షీట్‌ పేపర్‌పై డిజైన్‌ కత్తిరించాలి. ఆ కత్తిరించిన రంధ్రాలపై సిరా లేదా పెయింట్‌ వేసి డిజైన్లను వేయాలి. ఇప్పుడు ఈ స్టెన్సిల్‌ను మైమియోగ్రాఫ్‌లు, భిన్నమైన పెయింటింగ్‌లను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన జ్యోత్స్న ఈ స్టెన్సిల్‌ ఆర్ట్‌పై ప్రావీణ్యం సంపాదించింది. తక్కువ సమయంలో ఎన్నో అద్భుత దృశ్యాలను గీసి అందరి ప్రశంసలు పొందుతోంది.

స్టెన్సిల్‌ ఆర్ట్‌తో పురాణాల చిత్రాలు
సిఎస్‌ఈ స్పెషలైజేషన్‌తో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల జ్యోత్స్యకు లాక్‌డౌన్‌ కాలంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆర్ట్‌పై దృష్టి పెట్టింది. చిన్నతనం నుంచే డ్రాయింగ్‌, లలిత కళల పట్ల మక్కువ ఉన్న ఆమె, ఈ లాక్‌డౌన్‌ కాలంలో తిరిగి సాధన చేయడం ప్రారంభించింది. పేపర్‌ కటింగ్‌ ఆర్ట్‌ నేర్చుకునేందుకు, దాన్ని సాధన చేసేందుకు ఆ సమయాన్ని వినియోగించుకుంది. దాని కోసం యూట్యూబ్‌లో ట్రైనింగ్‌ వీడియోలను చూసింది. స్టెన్సిల్‌ ఆర్ట్‌లో నైపుణ్యాలను తెలుసుకుంది. ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడే ఇంటీరియల్‌ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సుకు కూడా పూర్తి చేసింది. తన ఆర్ట్‌ అందులోనూ ఉపయోగించేందుకు సాయపడుతుందని ఆమె భావిస్తోంది. 'స్టెన్సిలింగ్‌ ఆర్ట్‌'లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న జ్యోత్స్య... మహాభారతంలోని అనేక దృశ్యాలను, రామాయణంలోని ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వేసింది. మహనీయుల బొమ్మలను, జంతువుల, పక్షుల, ప్రకృతి అందాలను గీసింది. ఇందుకుగానూ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏసియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
దేనికి పనికి రాని ఆర్ట్‌పై దృష్టి పెట్టి సమయాన్ని వృథా చేస్తుందని ఆమె తల్లిదండ్రులు గతంలో హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో ఆమెని నిరుత్సాహ పరిచారు కూడా. కానీ జ్యోత్స్య పట్టువదలకుండా చాలా తక్కువ సమయంలో స్టెన్సిలింగ్‌ ఆర్ట్‌పై పట్టుసాధించింది. పురాణ, ఇతిహాసాల చిత్రాలను గీస్తూ అనుకున్న లక్ష్యానికి చేరుకుంది. ఇప్పుడు కూతురు విజయాన్ని చూసి జ్యోత్స్య తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.