Aug 29,2021 07:29

వరుస ఆఫర్లతో ఏళ్ల తరబడి సినీ ఇండిస్టీలో హీరోయిన్‌గా కొనసాగిన వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు పైనే అవుతున్నా ఇప్పటికీ మంచి క్రేజ్‌ ఉంది. సీనియర్‌ స్టార్‌ హీరోలతో పాటుగా యువ హీరోలతో కూడా తమన్నా జోడీ కడుతోంది. కేవలం సినిమాలే కాదు ఈ మధ్య డిజిటల్‌ తెరపై వెబ్‌ సీరీస్‌లతో కూడా అదరగొడుతోంది. ఇవే కాకుండా లేటెస్ట్‌గా ఒక రియాలిటీ షో హోస్ట్‌గానూ చేస్తుంది.

ఒకప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్న తమన్నా.. చిన్న వయస్సులోనే సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమా 'శ్రీ'తో టాలీవుడ్‌కి పరిచయమైంది. మంచు మనోజ్‌ హీరోగా నటించిన ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినప్పటికీ తమన్నాకు మాత్రం వరుస ఆఫర్లను తెచ్చిపెట్టింది. 2007లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్‌'తో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్‌, రచ్చ, బాహుబలి, సైరానరసింహారెడ్డి' చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుంది. తాజాగా మాస్టర్‌ చెఫ్‌ షోకి తెలుగులో తమన్నా హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డమ్ కోసం సినిమాల్లోకి రాలేదు!
అయితే ఇటీవల ఓ నేషనల్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. 'నేను పదిహేనేళ్ల వయస్సులో సినిమాల్లో పనిచేయడం మొదలు పెట్టినపుడు.. స్టార్‌ డమ్‌ను చూసి ఇక్కడికి రాలేదు. కెమెరా ముందు నటించే అవకాశం వస్తే చాలనుకున్నా. ఏదీ ఆశించకుండా నిజాయితీగా శ్రమించాలని నిర్ణయించుకున్నా. డబ్బు సంపాదించాలని, పెద్ద స్టార్‌ని అవ్వాలని ఏ రోజూ కోరుకోలేదు. నేను ఎంచుకున్న మార్గంలో ఏం అందుకున్నా సరే. పేరుప్రఖ్యాతులు కోల్పోతానని తానెప్పుడూ భయపడలేదని స్పష్టం చేసింది. వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే నేను ఇన్నేళ్లు ఇండిస్టీలో రాణించేదాన్ని కాదు. గొప్ప పేరును సంపాదించడం కంటే ప్రతిరోజు సెట్స్‌లో ఉండటమే ఓ వరంగా భావిస్తా. అగ్రనాయిక అనే ఇమేజ్‌కు దూరమవుతాననే భయం తనలో లేదు కాబట్టే పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తున్నా'నని చెప్పింది.
కెరీర్‌ ముగిసి పోయిందన్నారు
'గతాన్ని తల్చుకొని పశ్చత్తాపపడను. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలనే ప్రణాళికల్ని వేసుకోను. వర్తమానంలోనే జీవిస్తూ వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నా' అంటారు తమన్నా. 'విమర్శల్ని, అపజయాల్ని తల్చుకొని తొలినాళ్లలో చాలా బాధపడ్డా. నా కెరీర్‌ ముగిసిపోయిందని, కష్టాల్లో ఉన్నాననే వార్తలు చాలాసార్లు వచ్చాయి. నా ఆత్మవిశ్వాసాన్ని ఈ విమర్శలు దెబ్బతీయలేదు. అవన్నీ మరింత కష్టపడటానికి నాలో ప్రోత్సాహాన్ని నింపాయి. ఎవరైనా కష్టపడితేనే ఇండిస్టీలో కొనసాగగలరు. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. నా హార్డ్‌వర్క్‌కు అదృష్టం తోడవ్వడం వల్లే అభిమానుల్ని అలరిస్తున్నా' అని తెలిపారు.
సాయం గురించి చెప్పను!
సేవాభావం విషయంలో తన ఆలోచనా దృక్పథం వేరని చెప్పింది తమన్నా. వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పనని చెబుతోందీ తార. సినీ తారలకు అపారమైన సంపద ఉంటుందని, వారు ఎక్కడకు వెళ్లినా విలాసవంతంగా ఉంటారనే అపోహలు కూడా తొలగిపోవాల్సిన అవసరం ఉందని తమన్నా చెప్పింది. 'సినిమా వాళ్లకు సులువుగా డబ్బులు రావు. అందరిలాగానే వారూ కష్టపడాలి. తెరపై మాకున్న ఇమేజ్‌ వల్ల సినీతారలకు ఏదైనా సాధ్యమనే భ్రమలు పెరిగాయి. దాంతో నటీనటులపై ప్రతి విషయంలో ఒత్తిడి ఉంటోంది. ఈ ధోరణిలో మార్పు రావాలి' అని తమన్నా పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 14.3 మిలియన్లు, ట్విటర్‌లో 5.1 మిలియన్లు ఫాలోవర్లు ఉన్న తమన్నా ప్రస్తుతం తెలుగులో 'ఎఫ్‌-3', 'సీటీమార్‌', 'మాస్ట్రో', 'గుర్తుందా శీతాకాలం' చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
పేరు : తమన్నా భాటియా
పుట్టిన తేదీ : డిసెంబర్‌ 21,1989
పుట్టిన ప్రాంతం : ముంబై, మహారాష్ట్ర
చదువు : బిఎ
ఇష్టమైన నటులు : హృతిక్‌ రోషన్‌, మాధురీ దీక్షిత్‌
హాబీస్‌ : రీడింగ్‌, రైటింగ్‌ పోయట్రీ, డ్యాన్సింగ్‌
తల్లిదండ్రులు : సంతోష్‌ భాటియా, రజనీ భాటియా
సోదరులు : ఆనంద్‌ భాటియా