Oct 29,2020 16:31
నేడు 51వ ఇంటర్నెట్ దినోత్సవం

ఇంటర్నెట్ - ఇది ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ప్రపంచాన్ని పునర్నిర్మించిన ఏకైక విప్లవాత్మక సాధనం. సాంకేతిక విజ్ఞానాన్ని మన ముంగిట్లోకి... మన నట్టింట్లోకి... మన అరచేతిలోకి తీసుకొచ్చింది. 51 సంవత్సరాల క్రితం అక్టోబర్ 29 న ఇంటర్నెట్ ఒక అర్ధంలేని సందేశంతో ఆవిర్భవించింది. అందుకే  ప్రతియేటా అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని  అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. టెలికమ్యూనికేషన్స్, టెక్నాలజీ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుకు జ్ఞాపకార్థంగా అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969 లో ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు బదిలీ చేయబడిన మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపిన రోజు ఇది. 2005 నుండి, అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని టెలీకమ్యూనికేషన్స్ ,  సాంకేతిక చరిత్రలో ఒక చిరస్మరణీయ రోజుగా జరుపుకుంటారు.

అక్టోబర్ 29, 1969న లాస్ ఏంజెల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటిలో రెండు కంప్యూటర్ల మధ్య మొట్ట మొదటి సారి ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేశారు.  కాలిఫోర్నియా యూనివర్సిటిలో ప్రోగ్రామింగ్ స్టూడెంట్ గా ఉన్న చార్లీ క్లైన్.. అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్ వర్క్ (ARPANET) ద్వారా ప్రొఫెసర్ లియోనార్డ్ క్లీన్రాక్ పర్యవేక్షణలో యూనివర్సిటిలోని ఎస్ డిఎస్ సిగ్మా 7 హోస్ట్ కంప్యూటర్ నుంచి స్టాన్ ఫర్డ్ ఇనిస్టిట్యూట్ లో ఉన్న మరో ప్రోగ్రామర్ కు చెందిన ఎస్ఆర్ఐ ఎస్ డిఎస్ 940 హోస్ట్ కంప్యూటర్ కు మొదటిసారి ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేశారు. అయితే, టెర్మినల్స్ మధ్య కనెక్షన్ క్రాష్ కావడానికి ముందే క్లైన్ మరియు  క్లీన్రాక్ "L" మరియు "O" లను పంపగలిగారు. అందువల్ల, ARPANET పైఅక్షరాలా మొదటి సందేశం "లో".  క్లైన్ విజయవంతంగా పూర్తి "లాగిన్" సందేశాన్ని పంపగలిగినప్పుడు ఒక గంట తరువాత సమస్య పరిష్కరించబడింది. "లో" అనేది అక్టోబర్ 29 న మొట్టమొదటి సుదూర కంప్యూటర్ నెట్‌వర్క్ ద్వారా పంపబడిన మొదటి బిట్స్ డేటా.  అందువల్ల, ఈ రోజును ఇంటర్నెట్‌ దినంగా పరిగణిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతి మనిషికి ఇంటర్నెట్ చాలా ముఖ్యమైన నిత్యావసరంగా మారిపోయింది. ఒక్క క్షణం నెట్ లేకపోతే  ఏదో కోల్పోయినట్టుగా ఫీలయ్యే పరిస్థితి ఉంది.  మానవుని జీవితంలో కీలకంగా మారిపోయింది.  ఏ పనైనా నెట్ లేకుండా జరగని పరిస్థితి వచ్చింది. నెట్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా పెరిగిపోయాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. పబ్జీ వంటి గేమ్ ల వల్ల నష్టపోతున్నారు.  ఫోన్లు పట్టుకుని గంటల తరబడి గడుపుతూ...  మెదడుకు పని చెప్పడం తగ్గిపోయింది.  చెడు అలవాట్లకూ ఇంటర్నెట్ వేదికయింది. . అదే విధంగా గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇంటర్నెట్ మత్తులో యువత తమ లక్ష్యాలను పక్కకు వదిలేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతం కావడంతో... ఇందులో గడుపుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. 

ఇంటర్నెట్ రెండంచుల ఖడ్గం లాంటిది.  నాణేనికి రెండువైపులు వున్నట్లే... ఇంటర్నెట్ లోనూ రెండు ముఖాలు వున్నాయి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది  మన చేతిలోనే వుంది.  సృజనాత్మకతకు ఇంటర్నెట్ కొత్త మార్గాలను తెరిచింది. ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని జ్ఞానాన్ని పెంచుకుంటూ... కొత్తకొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. కరోనా సమయంలో ఇంటర్నెట్  ప్రజల మధ్య కమ్యూనికేషన్ కు ఎంతగానో ఉపయోగపడింది. ఆన్ లైన్ సమావేశాల నుండి ఆన్ లైన్ తరగతుల వరకు ఇంటర్నెట్టే కారణం. లాక్ డౌన్ తో మూతబడిన సినిమాహాళ్లకు బదులు ఓటిటి ద్వారా సినిమాలను  మన ఇంట్లోకే తీసుకొచ్చింది ఇంటర్నెట్. ఇలా అనేక ఉపయోగాలూ వున్నాయి. ముందుముందు ఇంకెన్ని ఆవిష్కరణలను, అద్భుతాలను ప్రపంచానికి అందిస్తుందో వేచిచూద్దాం...