May 04,2021 08:15
  • భారతీయ రైల్వేల్లోనే రికార్డు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : భారతీయ రైల్వేల్లోనే 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో తూర్పు కోస్తా రైల్వే 205 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాను చేపట్టి రికార్డును నెలకొల్పింది. కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా తూర్పు కోస్తా రైల్వే సరుకు లోడింగ్‌లో ప్రగతి పథంలో పయనించింది. 2002-2003 ఆర్థిక సంవత్సరంలో అవిభక్త సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే సాధించిన 202 మిలియన్‌ టన్నుల అత్యధిక లోడింగు రికార్డును తాజాగా తూర్పు కోస్తా రైల్వే జోన్‌ ఛేదించిందని తూర్పు కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ విద్యాభూషణ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్‌, సంబ్‌పూర్‌, ఖుర్దా రోడ్‌ డివిజన్‌లు తొలి నుంచీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారతీయ రైల్వే ఆదాయ సముపార్జనలో 47.32 శాతం వాటాను సమకూర్చడం ద్వారా తూర్పు కోస్తా రైల్వే జోన్‌ ప్రాముఖ్యత గడించింది. కోవిడ్‌ పరిస్థితులు తరుముతున్నా సిబ్బంది, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అధిక ఆదాయాన్ని తూర్పు కోస్తాకు సాధించి పెట్టడంలో అద్భుత కృషి చేశారని ఈ సందర్భంగా జిఎం విద్యాభూషణ్‌ ప్రశంసించారు.
 

                                                               లెక్కల్లోకి వెళితే...

   2020-21 ఆర్థిక సంవత్సరంలో సౌత్‌ ఈస్ట్రర్న్‌ రైల్వే 175.79 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయగా, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఇసిఆర్‌) 186.61 మిలియన్‌ టన్నులు చేసింది.
   తూర్పు కోస్తా రైల్వే 205 మిలియన్‌ టన్నులు చేపట్టి రికార్డు నెలకొల్పింది. 2019-20లో తూర్పు కోస్తా రైల్వే 200.35 మిలియన్‌ టన్నుల కార్గో చేయగా, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే 171 మిలియన్‌ టన్నులు, ఎస్‌ఇసిఆర్‌ 186 మిలియన్‌ టన్నులు చేసింది. అంతకు ముందు సంవత్సరం అంటే 2018 - 2019లో కూడా తూర్పు కోస్తా రైల్వేదే ఆగ్రస్థానం. 191 మిలియన్‌ టన్నులను తూర్పు కోస్తా చేపట్టగా.. ఎస్‌ఇసిఆర్‌ 181 మిలియన్‌ టన్నులు, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే 154 మిలియన్‌ టన్నులు లోడింగ్‌ చేసింది. వాల్తేరు, ఖుర్దా, సంబల్‌ పూర్‌ డివిజన్‌ల వల్లే ఇది సాధ్యమైందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వాల్తేరు డివిజన్‌ అధిక ఆదాయానికి పోర్టు, స్టీల్‌ప్లాంట్‌ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కారణంకాగా, ఖుర్దా డివిజన్‌లో పరదీప్‌ పోర్టు, దాల్చేరు బొగ్గు గనులు ఉన్నాయి. ఆదాయాన్ని సముపార్జించడంలో 2020 - 21 తాజా ఆర్థిక సంవత్సరంలో ఇవే కీలక పాత్ర పోషించాయి.