Sep 13,2021 07:38

వైవిధ్య కథలు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బాలీవుడ్‌. 'విక్కీ డోనర్‌', 'బాలా', 'గుడ్‌ న్యూజ్‌' ఇలా చెప్పుకొంటూ పోతే ఏ చిత్రానికి అదే భిన్నమైనది. సరోగసీ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినా, 'మిమి' కాస్త భిన్నమైనది. 2011లో వచ్చిన మరాఠా చిత్రం 'మలా ఆరు వV్‌ాచే' ఆధారంగా 'మిమి'ని తెరకెక్కించారు. ఇదే చిత్రం తెలుగులో 'వెల్‌కమ్‌ ఒబామా'గా రీమేక్‌ అయింది. అయితే, మాతకలో ఉన్న భావోద్వేగాలను కొనసాగిస్తూ, తనదైన కామెడీ టచ్‌ ఇచ్చి 'మిమి'ని తీర్చేదిద్దే ప్రయత్నం చేశాడు లక్ష్మణ్‌. ఈ చిత్రం ఏవిధంగా ఉందో తెలుసుకుందాం..!

నటీనటులు : కృతి సనన్‌, పంకజ్‌ త్రిపాఠి, సాయి తమ్హాంకర్‌, సుప్రియా పాథక్‌ తదితరులు
దర్శకత్వం : లక్ష్మణ్‌ ఉటేకర్‌
నిర్మాత : దినేస్‌ విజాన్‌,
జియో స్టూడియోస్‌
సినిమాటోగ్రఫీ : ఆకాశ్‌ అగర్వాల్‌
ఎడిటింగ్‌ : మనీష్‌ ప్రధాన్‌
మ్యూజిక్‌ : ఏఆర్‌ రెహ్మాన్‌
బ్యానర్‌ : మడోక్‌ ఫిల్మ్స్‌,
జియో స్టూడియోస్‌
ఓటీటీ రిలీజ్‌ : నెట్‌ఫ్లిక్స్‌

కథలోకి వెళ్తే.. అమెరికాకు చెందిన దంపతులు సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలని చూస్తుంటారు. అందుకోసం ఆరోగ్యవంతురాలైన మహిళ కోసం వెతుకుతుంటారు. ఈ విషయం డ్రైవర్‌ భాను ప్రతాప్‌ పాండే (పంకజ్‌ త్రిపాఠి)కి తెలుస్తుంది. దీంతో తన స్నేహితురాలైన మిమి రాఠోడ్‌(కృతి సనన్‌) గురించి వాళ్లకు చెబుతాడు. సరోగసీ ద్వారా డబ్బు వస్తుందని చెప్పి, మిమినీ ఒప్పిస్తాడు. దీంతో రూ.20 లక్షలకు ఇరువురి మధ్య ఒప్పందం కుదురుతుంది. మిమి డబ్బు కూడా తీసుకుంటుంది. అయితే డెలివరీ డేట్‌ సమయానికి నాటకీయ పరిణామాలు జరిగిపోతాయి. పుట్టేబిడ్డలో శారీరక వైకల్యం ఉందన్న డాక్టర్‌ మాటలతో అమెరికా జంట స్వదేశానికి వెళ్లిపోతుంది. దీంతో బిడ్డనేం చేయాలో తెలీక, తండ్రెవరో చెప్పలేక, తల్లిదండ్రులను ఒప్పించలేక మిమి సంఘర్షణ అంతా ఇంతా కాదు. డ్రైవరే తన భర్తని చెబుతుంది. అతని తల్లి, మొదటిభార్య ఎంట్రీతో నిజం బయటికొస్తుంది. ఆ నిజాన్ని మిమి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయినా పిల్లాడి బోసినవ్వులు, బుడిబుడి నడకలు ఆ ఇంట్లో వెలుగులు నింపుతాయి. అయితే మిమి గర్భవతి అన్న విషయం తెలిసి, ఆమె తల్లిదండ్రులు ఏం చేశారు? కడుపులో ఉన్న ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే !
     అమెరికా దంపతులు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మని ఇవ్వాలనుకోవడం, అది భానుకు తెలిసి మిమి వద్దకు తీసుకురావటం, ఆమె మొదట వద్దనుకున్నా, డబ్బు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోవడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధంలో చూపించాడు దర్శకుడు. పాత్రల మధ్య హాస్యాన్ని పంచుతూనే నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అమెరికా దంపతులు అద్దె గర్భాన్ని వద్దనుకున్నారో అక్కడి నుంచి కథ ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. ద్వితీయార్ధంలో పాత్రల మధ్య ఘర్షణ చూపించాడు. ఆయా సన్నివేశాలను లక్ష్మణ్‌ తనదైన శైలిలో ప్రజెంట్‌ చేశాడు. చివరి వరకూ ఆ ఎమోషన్‌ టెంపోను కొనసాగించాడు. అదే సమయంలో కథా గమనం వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త పెరిగిందేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఒక ఎమోషనల్‌ డ్రామాను చూశామన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది.
     మిమి పాత్రలో కృతిసనన్‌ ఒదిగిపోయింది. అమెరికా దంపతులు అద్దె గర్భం వద్దన్న తర్వాత ఏం చేయాలో పాలుపోని సగటు మహిళగా ఆమె చక్కని హావభావాలు పలికించింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇంకా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఆమెది. అయితే, ఆమె నుంచి ఏ స్థాయి నటన రాబట్టుకోవాలన్నది దర్శకుడి చేతిలో ఉంటుంది. ఈ ఏడాది ఆమెకు 'మిమి' గుర్తుండిపోయే చిత్రమని చెప్పవచ్చు.. డ్రైవర్‌ భానుగా పంకజ్‌ త్రిపాఠి మెప్పించారు. తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించారు. ఒక రకంగా ఈ సినిమాకు ఆయన ప్రధాన ఆయువు పట్టు అయ్యారు. సాయి తమంకర్‌, మనోజ్‌ పవా, సుప్రియ పాఠక్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్‌ రెహమాన్‌ మరోసారి మేజిక్‌ చేశారు. నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. ఆకాశ్‌ అగర్వాల్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌కు ఫ్రెష్‌లుక్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మనీష్‌ ప్రధాన్‌ ఎడిటింగ్‌ ఓకే. హాస్య సన్నివేశాలు అలరించేలా ఉన్నా, లింగ భేదం, మత విశ్వాసాలు, వర్ణ వివక్ష ఇలా ఇతర అంశాలను టచ్‌ చేయడంతో అసలు పాయింట్‌ నుంచి కాస్త పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది.