- మూడో సోమవారం పెరిగిన భక్తుల రద్దీ
ప్రజాశక్తి - శ్రీశైలం: కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పౌర్ణమి కలిసి రావడంతో క్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించేందుకు భక్తుల సంఖ్య పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో క్షేత్రంలోని వీధులన్నీ కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో, నాగులకట్ట వద్ద, గంగాధర్ మండపం వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో కుటుంబాల వారీగా కార్తీక పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు మైక్ ద్వారా భక్తులకు అవగాహన కల్పించారు. మూడో సోమవారం కావడంతో ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి చేపట్టారు. 10 రకాల హారతులను ఏర్పాటు చేశారు. రకరకాల విద్యుద్దీపాలంకరణ, అలంకరణలు ఏర్పాటు చేశారు. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించుకునే వారికి ఆన్లైన్ ద్వారా కూడా అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
కొలిమిగుండ్ల : కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు, అభిషేకం, అఖండ దీపోత్సవం నిర్వహించారు. మార్కాపురం కృష్ణా రెడ్డి, నాగ మాంబ మఠం సేవా ట్రస్ట్ శివరామకృష్ణ, నరేంద్ర, మధు శేఖర్, అందే మధుసూదన్ పాల్గొన్నారు.
బనగానపల్లె : మండలంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి ఉమా మహేశ్వర దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఉమామహేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇఒ డిఆర్కెవి.ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతులను కల్పించారు. మీరాపురం బుచ్చి రెడ్డి, మనోహర్ రెడ్డి, పాతపాడు వెంకటేశ్వర రెడ్డి, బెడదల చంద్రశేఖర్ రెడ్డి, బెడదల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
మంత్రాలయం : మంత్రాలయం సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదీతీరం లక్ష దీపోత్సవంతో కాంతులు వెదజల్లింది. తుంగ హారతి సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవంతో కనులవిందు చేశారు. దీపకాంతుల మధ్య తుంగభద్ర నదీతీరం భక్తుల సందడితో కిటకిట లాడింది.
- మూడో సోమవారం పెరిగిన భక్తుల రద్దీ