Jun 11,2021 16:17

ముంబయి : విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు సిరీస్‌లు ముగిసే సమయానికి శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్‌ నిర్వహించాలని బిసిసిఐ భావించి పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ప్లేయర్లతో మరో జట్టును ప్రకటించింది. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా.. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన ఈ జట్టులో హార్ధిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండే, యజ్వేంద్ర చాహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌ వంటి సీనియర్లతో పాటు కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం దక్కింది. పేసర్లుగా భువీకి తోడుగా దీపక్‌ చాహార్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియాలకు జట్టులో చోటు దక్కింది. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే, టీ20, టెస్టు ఆరంగ్రేటం చేసి రికార్డు క్రియేట్‌ చేసిన నటరాజన్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. అంతేకాదు, ఐపిఎల్‌ 2021 సీజన్‌లో అద్భుత బౌలింగ్‌తో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన హర్షల్‌ పటేల్‌కు, కెప్టెన్‌ రేసులో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా ఛాన్స్‌ రాలేదు. దీనిపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.

కాగా, ఆస్ట్రేలియా టూర్‌ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన నటరాజన్‌.. మోకాలికి ఫిజియో పర్యవేక్షణలో ఎన్‌సిఎలో ఉండి చికిత్స చేయించుకున్నాడు. అయితే, ఐపిఎల్‌ 2021 సీజన్‌లో ఈ గాయం తిరగబెట్టింది. మోకాలి గాయం కారణంగా ఐపిఎల్‌ 2021 సీజన్‌లో రెండే మ్యాచులు ఆడిన నట్టూ.. ఆ తర్వాత సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో నట్టూకి శ్రీలంక టూర్‌ నుంచి విశ్రాంతి సెలక్టర్లు కల్పించారు. ఇక, 2021 సీజన్‌లో అద్భుతంగా రాణించిన హర్షల్‌ పటేల్‌, ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ రేసులో టాప్‌లో నిలిచాడు. అయితే హర్షల్‌ పటేల్‌ను ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం అతని వయసేనని తెలుస్తోంది. టి20 వరల్డ్‌కప్‌ 2021, 2022 టోర్నీలకు జట్టును తయారుచేయడమే టార్గెట్‌గా శ్రీలంక టూర్‌ని బిసిసిఐ పరిగణిస్తోంది. దీంతో 30 ఏళ్లు దాటినవారిని కొత్తగా జట్టుకి ఎంపిక చేస్తే, వారు దీర్ఘకాలం జట్టులో సేవలు అందించడం సాధ్యం కాదని సెలక్టర్లు భావిస్తున్నారు. హర్షల్‌ పటేల్‌తో పాటు ఢిల్లీ క్యాపటల్స్‌ యంగ్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ కూడా అద్భుతంగా రాణించాడు. అయితే ఆవేశ్‌ ఖాన్‌, ఐసిసి వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి బ్యాకప్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఇంగ్లాండ్‌తో ఉండడంతో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చే అద్భుత అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ సమయంలో గాయపడి ఐపిఎల్‌ 2021 సీజన్‌కి దూరమైన శ్రేయాస్‌ అయ్యర్‌ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు తేల్చేశారు. దీంతో అతన్ని కూడా పక్కనబెట్టేశారు. శ్రేయాస్‌ అయ్యర్‌ సమయానికి ఫిట్‌నెస్‌ సాధించి ఉంటే, శ్రీలంకలో పర్యటించే జట్టుకి మొదటి ఛాయిస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యేవాడు. అతనితో పాటు ఐపిఎల్‌ 2021 సీజన్‌లో పెద్దగా పర్ఫామ్‌ చేయలేకపోయిన రాహుల్‌ తెవాటియా కూడా జట్టులోకి వచ్చినట్టే వచ్చి, స్థానం కోల్పోయాడు.