Dec 03,2021 21:09

న్యూఢిల్లీ : ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి నాలుగు ఆంశాల ప్రణాళికను అమలు చేయడానికి భారత్‌ాశ్రీలంక అంగీకరించాయి. భారత్‌లో శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సా ఇటీవల జరిపిన రెండు రోజుల పర్యటనలో ఈ నిర్ణయానికి వచ్చాయి. భారత్‌ మంజూరు చేసిన ఆహారం, ఔషధాలు, ఇంధన కొనుగోళ్లకు రుణాలు ఇవ్వడం, శ్రీలంక చెల్లింపుల బ్యాలెన్స్‌ను పరిష్కరించడానికి కరెన్సీ స్వాప్‌ ఒప్పందం, కొన్ని సంవత్సరాల క్రితమే భారత్‌ కొనుగోలు చేసిన ట్రింకో ఆయల్‌ సంస్థల అధునీకరణ, వివిధ రంగాల్లో భారత్‌ పెట్టుబడులను సులభతరం చేయడానికి శ్రీలంక నిబద్ధత అనే నాలుగు అంశాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి.
ఈ ప్రణాళిక విధివిధానాలను ఖరారు చేయడానికి అంగీకరించినట్లు బాసిల్‌ రాజపక్సా పర్యటన ముగింపు సందర్భంగా శ్రీలంక హైకమిషన్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా బాసిల్‌ బుధవారం జరిగిన అసాధారణ సంయుక్త సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌లతో పాల్గన్నారు. ఈ సమావేశానికి భారతల్‌ శ్రీలంక హై కమిషనర్‌ మిలింద మరగొడ, శ్రీలంక ఆర్థిక కార్యదర్శి ఎస్‌ఆర్‌ అత్యాగల్లే కూడా హజరయ్యారు.
కాగా, శనివారం అబుదాబీలో జరిగే హిందూ మహా సముద్ర ప్రాంతీయ సదస్సులో శ్రీలంక అధ్యక్షులు గొటబయ రాజపక్సాతో కేంద్ర మంత్రి జైశంకర్‌ భేటీ కానున్నారు.