Dec 03,2021 21:08

గాలే: వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో, ఆఖరి టెస్ట్‌లో లంక జట్టు 164 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 329 పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించిన లంక జట్టు 9 వికెట్ల నష్టానికి 345 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. ధనుంజయ(155నాటౌట్‌) భారీ సెంచరీతో రాణించాడు. దీంతో 299 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ జట్టు లసిత్‌(5/35), రమేశ్‌ మెండీస్‌(5/66) దెబ్బకు 132 పరుగులకే కుప్పకూలింది. బోనర్‌(44), బ్లాక్‌వుడ్‌(44) బ్యాటింగ్‌లో రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ధనుంజయ డి సిల్వకు, సిరీస్‌ రమేశ్‌ మెండీస్‌కు దక్కాయి.