Oct 27,2021 20:41

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ముందుకు..
ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రతికూల ఫలితాలచ్చాయి. పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌ ఓటమిపాలవ్వగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప జోడీ రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌ 21-18, 20-22, 19-21తో మూడుసెట్ల హోరాహోరీ పోరులో టాప్‌సీడ్‌ జపాన్‌కు చెందిన కెంటో మొమొటో చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌ సుమారు 79 నిమిషాలసేపు సాగింది. గత వారం జరిగిన డెన్మార్క్‌ ఓపెన్‌లోనూ మొమొటో చేతిలోనే శ్రీకాంత్‌ ఓటమిపాలయ్యాడు. కానీ ఈసారి టాప్‌సీడ్‌కు శ్రీకాంత్‌ ముచ్చెమటలు పట్టించడం విశేషం. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 24వ సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప జోడీ 21-19, 21-15తో డెన్మార్క్‌కు చెందిన మథియాస్‌-మరు సర్రోలను 37 నిమిషాల్లో ఓడించారు. రెండోరౌండ్‌లో భారత మిక్స్‌డ్‌ జోడీ 2వ సీడ్‌ ఇండోనేషియాకు చెందిన ప్రవీన్‌ జోర్డాన్‌-మెలటి డేవాలతో తలపడనున్నారు.