Nov 14,2020 11:27

న్యూఢిల్లీ :  సైనికులతో దీపావళి జరుపుకునేందుకు ప్రధాని మోడీ నేడు రాజస్థాన్‌ సరిహద్దులోని లొంగెవాలా పోస్టుకు చేరుకున్నారు. 2014లో ప్రధానిగా అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతి ఏడాది దీపావళి వేడుకలను మోడీ సరిహద్దులోని సైనికులతో జరుపుకుంటున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌) డిజి. రాకేష్‌ ఆస్థానా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం. నరవణే, డిఫెన్స్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌లు ప్రధానితో పాటు ఉన్నారు. ప్రధాని మోడీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ప్రకాశం, సంతోషాలను కలిగించాలని అన్నారు. అందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధానీ మోడీ ట్వీట్‌ చేశారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమానికి సంబంధించిన ఆడియోను పోస్ట్‌ చేశారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వందనం చూస్తూ.. ప్రతి పౌరుడు ఒక దివ్వెను వెలిగించాలంటూ అక్టోబర్‌ 25న చెప్పిన క్లిప్పింగ్‌ను మరోసారి పోస్ట్‌ చేశారు. 1971లో జరిగిన లాంగ్వెలా యుద్ధం అనంతరం ఇక్కడ ఒక సైనికుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.