Nov 30,2020 00:28

నినాదాలు చేస్తున్న గిరిజన సంఘం నాయకులు, సరిహద్దు గ్రామాల ప్రజలు

డుంబ్రిగుడ : మండలంలోని కొల్లాఫూట్‌ పంచాయతీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ హెచ్చరించారు. మండలంలోని కొల్లాఫూట్‌, గసభ పంచాయతీల పరిధిలోని నిట్ఠమామిడి, బొడ్ల మామిడి, డెక్కపారు, కొల్లాఫూట్‌, పుట్టు నందివలస, బలియగుడ, బిట్రగాండ సరిహద్దు గ్రామస్తులతో ఆదివారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు వివాదంపై ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. వివాదంలో ఉన్న భూముల రక్షణకు ఐటిడిఎ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సరిహద్దు గ్రామాల గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఆంధ్ర, ఒడిశా ప్రాంతాలకు శాశ్వత సరిహద్దు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సరిహద్దు గ్రామాల్లో పోడుసాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చెయ్యాలన్నారు. అక్రమంగా కాఫీ తోటలను నరికిన ఒడిశా వాసులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచి జి.సుందరరావు, సీదరి భీమరాజు, పి.రామ్మూర్తి, జి.సింహాచలం, గిరిజన సంఘం నాయకులు పి.సత్య నారాయణ, వి.రామ్మూర్తి పాల్గొన్నారు.