Aug 01,2021 10:59

బాక్సింగ్‌ కథాంశంతో ఇప్పటివరకూ హిందీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే స్పోర్ట్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా ఎక్కువ శాతం సినిమాలు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఆ కోవలోనిదే తమిళంలో విడుదలైన సార్పట్టా చిత్రం. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్య ఈ చిత్రం కోసం బాగా శ్రమించాడనే చెప్పొచ్చు. నటుడిగా వేరియేషన్స్‌ కోసం విలన్‌ పాత్రలు కూడా చేసే ఆర్య తాజాగా నటించిన పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా 'సార్పట్ట పరంపర'. రజనీకాంత్‌తో కబాలి, కాలా చిత్రాలు చేసి, సౌత్‌లో గుర్తింపు పొందిన పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకుడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కథలోకి వెళితే..

టైటిల్‌ : సార్పట్ట
తారాగణం : ఆర్య, దుషారా విజయన్‌,
పశుపతి, అనుపమ కుమార్‌, జాన్‌ కొక్కెన్‌ తదితరులు
సంగీతం : సంతోష్‌ నారాయణ్‌
సినిమాటోగ్రఫీ : మురళి.జి
ఎడిటర్‌ : సెల్వ ఆర్‌.కె
నిర్మాణం : నీలం ప్రొడక్షన్స్‌, కె9 స్టూడియో
నిర్మాతలు : షణ్ముగం దక్షన్‌ రాజ్‌
దర్శకత్వం : పా.రంజిత్‌
విడుదల తేదీ : 22.07.2021
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

   ది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలం. చెన్నై (మద్రాసు) నగరంలో బ్రిటిష్‌ వారి నుంచి నేర్చుకున్న బాక్సింగ్‌ బాగా వ్యాపిస్తుంది. వంశపారంపర్యంగా బాక్సింగ్‌ నేర్చుకున్నవారు గ్రూపులుగా ఏర్పడతారు. ఆ గ్రూపులని పరంపరగా పిలుస్తుంటారు. అందులో ప్రధానమైనవి సార్పట్ట పరంపర, ఇడియప్ప పరంపరలు. ఈ రెండు పరంపరలూ మొదటి స్థానం కోసం ప్రతి ఏడాది పోటీ పడుతూనే ఉంటాయి. అయితే సార్పట్ట పరంపరకు రంగయ్య (పశుపతి) కోచ్‌గా ఉంటారు. ఇడియప్ప పరంపరకు సింహాచలం (జి.ఎం.సుందర్‌) కోచ్‌గా ఉంటారు. అయితే సార్పట్ట రంగయ్య కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. ఇడియప్ప పరంపరపై సార్పట్టాని విజేతగా నిలపాలనేది అతడి ఆశయం. దానికోసం తన శిష్యులకు శిక్షణ ఇస్తుంటాడు. ఇక స్కూల్‌ ఎగ్గొట్టి మరీ బాక్సింగ్‌ పోటీలు చూస్తూ దానిపై మక్కువ పెంచుకుంటాడు సమరన్‌ (ఆర్య). యువకుడు అయ్యాక హార్బర్‌లో కూలిపని చేస్తూ కూడా బాక్సింగ్‌ పోటీలు చూస్తుంటాడు. ఎప్పటికైనా బాక్సింగ్‌ రింగ్‌లో తలపడాలనేది అతడి కోరిక. కానీ కొడుకు బాక్సింగ్‌ పోటీలకు వెళ్లడం తల్లి భాగ్యం (అనుపమ కుమార్‌)కు అస్సలు నచ్చదు. కనీసం బాక్సింగ్‌ పేరెత్తడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే బాక్సింగ్‌ క్రీడాకారుడైన హీరో తండ్రిని కొందరు రౌడీగా మార్చి, హతమారుస్తారు. దీంతో కొడుకు ఆ మార్గంలోకి వెళ్లకూడదని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో సార్పట్ట ఆటగాడు ఇడియప్ప పరంపర ప్రధాన ఆటగాడు వేటపులి (జాన్‌ కొక్కెన్‌) చేతిలో ఓటమి చెందుతాడు. అవమానభారం ఉన్నప్పటికీ రంగయ్య ఇడియప్ప పరంపరకు ఛాలెంజ్‌ చేస్తాడు. ఈ క్రమంలో సమరన్‌ అనుకోని పరిస్థితుల్లో బాక్సింగ్‌ చేస్తూ రంగయ్య కంటపడతాడు. బాక్సింగ్‌ గ్లౌజ్‌ వేసుకుంటాడు. అసలు రంగయ్య చేసిన ఛాలెంజ్‌ ఏంటి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే గురువు రంగయ్య కోసం సమరన్‌ ఎలాంటి సాహసం చేశాడు? బాక్సింగ్‌ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరన్‌ ఓడిస్తాడా? జీవితంలో ఓడుతున్న కొడుకుని బాక్సింగ్‌ చేయమని తల్లి ఎందుకు ప్రోత్సహిస్తుంది? అనేదే మిగతా కథ.
     ముఖ్యంగా ఈ కథకి ఆయువుపట్టు పాత్రధారులు. ప్రతి పాత్రకీ సరిగ్గా సరిపోయే ఆర్టిస్టులు దొరకడం ఒక హైలెట్‌. కథని చివరిదాకా తమ నటనాపటిమతో లాక్కుపోయారు. ఆర్య ఈ పాత్ర కోసం శారీరకంగా ఎంత కష్టపడ్డాడో తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్‌పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లి మాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగా ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక గురువు రంగయ్య పాత్రలో పశుపతి చక్కగా ఒదిగిపోయాడు. సమరన్‌ భార్యగా దుషారా విజయన్‌ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్‌ కొక్కెరు కొండంత శరీరంతో పాత్రకి సరిపోయాడు. డాడీ పాత్రలో జాన్‌ విజరు తన ఇంగ్లీష్‌ డైలాగ్స్‌తో కొంత హాస్యాన్ని పండించాడు. అనుపమకుమార్‌, షబ్బీర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
      టెక్నికల్‌గా చూసుకుంటే అప్పటి బాక్సింగ్‌ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్‌. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. స్పోర్ట్స్‌ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్‌ టచ్‌ ఇచ్చి, తీర్చిదిద్దిన విధానం బాగుంది. నేపథ్య సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణ్‌ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. మురళి.జి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కథలో పెద్ద మైనస్‌ నిడివి. సెల్వ ఆర్‌.కె సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్‌.. సెకండాఫ్‌లో ఉంటే 'సార్పట్ట' మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలను ఇష్టపడేవారికి 'సార్పట్ట' నచ్చుతుంది.