
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 96 వినతులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి స్వీకరించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు చెందిన వినతులు 19 కాగా, పౌరసరఫరాల శాఖకు చెందినవి 16, స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ 24, ఇతర శాఖలకు సంబంధించి 37 వినతులు స్వీకరించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్, ఇ-మెయిల్ ద్వారా వినతులు పంపించాలని కలెక్టర్ జె.నివాస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జలుమూరు మండలం కొల్లవానిపేట గ్రామం నుంచి వై.కృష్ణంరాజు ఫోన్ చేస్తూ రేషన్‌కార్డులో వయసు తక్కువ ఉండడం వల్ల పెన్షన్ రావడం లేదని సరిచేయాలని కోరారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌ను హరిపురంలో ఏర్పాటు చేస్తున్నారని, భేతాళపురంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని మందస మండలం హరిపురానికి చెందిన వి.వెంకటరావు సూచించారు. మెళియాపుట్టి మండలం వెంకటాపురం నుంచి జి.కాంతమ్మ ఫోన్ చేసి కొండపోడు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ నుంచి చలమయ్య, స్పందన విభాగం సూపర్వైజర్ బి.వి.భాస్కరరావు, హెచ్-సెక్షన్ డిటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.