Nov 30,2020 21:25

ఫిర్యాదుదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

విజయనగరం : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కు 72 వినతులు అందాయి. వీటిలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఆదరణ, రైతు భరోసా లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జెసి జె.వెంకటరావు, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, విపత్తుల శాఖ అధికారి పద్మావతి వినతులను అందుకున్నారు. స్పందన వినతులు పలు శాఖల అధికారుల వద్ద 1200 వరకు పెండింగ్‌ ఉన్నాయని, వెంటనే ఇవి పరిష్కారమ య్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు.
బధిరులకు, వయో వృద్ధులకు శ్రవణ యంత్రాలు పంపిణీ
స్పందన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ నుంచి జిల్లాకు కేటాయించిన నాలుగు శ్రవణ యంత్రాలను బధిరులకు, వయోవృద్ధులకు కలెక్టర్‌, జెసి జె.వెంకటరావు, ఎడి నీలకంఠ ప్రధానో అందజేశారు. అలాగే దూరప్రాంతాల నుంచి స్పందన వినతులివ్వడానికి వచ్చే వారి కోసం, గర్భిణీలు, వికలాంగుల కోసం 10 రూపాయలకే రుచికరమైన భోజనాలను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు.
కన్వర్జెన్స్‌ పనులు సత్వరమే ప్రారంభం కావాలి
ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్స్‌ పనులను సత్వరమే ప్రారంభించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. స్పందన అనంతరం కలెక్టర్‌ పలు పథకాల పురోగతిపై సమీక్షించారు. రైతు భరోసా, వెల్నెస్‌ కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలకు ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. జగనన్న పచ్చతోరణం సమీక్షిస్తూ తక్కువ సాధించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ బీమా, జగనన్న తోడు పధకాలలో పురోగతి కనపడాలన్నారు. జిల్లాలో 514 ఇ - సేవలు పెండింగ్‌ ఉన్నాయని, ముఖ్యంగా రెవిన్యూ శాఖ లో ఎక్కువగా ఉన్నాయని, ఈ రోజే ఆయా అధికారులతో మాట్లాడి సాయంత్రం లోగా క్లియర్‌ అయ్యలా చూడాలని డిఆర్‌ఒకు సూచించారు. జలసిరి దరఖాస్తు గ్రౌడింగ్‌ వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల స్థలాల ప్రక్రియపై ప్రత్యేకాధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పలు కులాల కార్పొరేషన్లకు అవసరమగు కులాల రీసర్వే వేగంగా జరిగేలా చూడాలని సాంఘిక సంక్షేమ డిడి సునీల్‌రాజ్‌కుమార్‌కు సూచించారు.