Jul 18,2021 12:35

సొరచేప ప్రమాదకరమైన చేప జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు ఈ జాతి చాలా ఎక్కువగా ఉండేది. నేడు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో యేల్‌, కాలేజ్‌ ఆఫ్‌ ది అట్లాంటిక్‌ శాస్త్రవేత్తలు కొన్ని విషయాలపై పరిశోధనలు చేశారు. అప్పుడు అనుకోకుండా సొరచేపకు సంబంధించిన అనేక రహస్యాలను వారు బయటపెట్టారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం తప్పక చదవాల్సిందే..

సొరచేపలు 19 మిలియన్‌ సంవత్సరాల క్రితం భారీగా చనిపోయినట్లు వారి పరిశోధనల్లో తేలింది. నేటితో పోల్చుకుంటే అప్పట్లో మహా సముద్రాల్లో ఇవి 10 రెట్లు ఎక్కువగా ఉండేవట.
     'సొరచేపలపై పరిశోధన చేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా మా పరిశోధన ఇటువైపు మరలింది. నేను లోతైన సముద్ర అవక్షేపాల్లో మైక్రోఫొసిల్‌ చేపల దంతాలు, షార్క్‌ ప్రమాణాలను అధ్యయనం చేస్తాను. 66 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం భూమిని తాకిన సమయంలో సొరచేపల్లో రెండింతల సంఖ్యలో మృత్యువాత పడ్డాయని మా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం 85 మిలియన్‌ సంవత్సరాల నుంచి చేపలు, సొరచేపల చరిత్రను తెలుసుకోవాలని మా బృందం అనుకుంటోంది. అప్పటి నుంచి వాటి డ్రాపవుట్‌ ఎలా ఉందో కనుగొంటాము. 19 మిలియన్‌ సంవత్సరాల క్రితం సొరచేపలు 70 శాతంపైనే అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయని తెలిసింది. తర్వాత అవి దాదాపు పూర్తిగా అంతరించిపోయాయి. మరలా ఆ జాతి ఎందుకు పుంజుకోలేదో వివరించాలంటే మరెన్నో పరిశోధనలు చేయాల్సి ఉంది' అని యేల్‌ యూనివర్శిటీలోని ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌ విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధకురాలు ఎలిజబెత్‌ సైబర్ట్‌ వెల్లడించారు.
     'వాస్తవానికి తీరప్రాంత జలాల్లోని సొరచేపల కంటే మహా సముద్రాల్లో నివసించే వాటి మరణాల సంఖ్య రెట్టింపు అని గుర్తించాం. ఇవి సముద్రాలను వదిలేసి, వాటి నివాసాలను మార్చుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలను పరిశోధన చేయాల్సి ఉంది' అని స్టేట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ పారెస్ట్రీ డాక్టోరల్‌ విద్యార్థి రూబిన్‌ తెలిపారు.
జనవరిలో శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం బహిరంగ సముద్రాల్లో నివసించే సొరచేప జాతి గత అర్ధశతాబ్దంలో 70 శాతం తగ్గింది. ఈ జాతి ఇంత త్వరగా అంతరించడానికి అధికంగా వేటాడటమూ ఒక కారణం. ఏదేమైనా 19 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఈ భూమిపై మానవులే లేరు. కాబట్టి అప్పట్లో ఏమి జరిగింది అనేది పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
 

మరికొన్ని విషయాలు...

 • సొరచేపలు 400 మిలియన్‌ సంవత్సరాల క్రితమే ఉనికిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే డైనోసార్లకన్నా 200 మిలియన్‌ సంవత్సరాల ముందన్నమాట.
 • మొదట్లో కళ్లు, రెక్కలు, ఎముకలు లేని చిన్న ఆకు ఆకారంలో జన్మించాయని వారు భావిస్తున్నారు.
 • శిలాజాల రికార్డుల ప్రకారం 3 వేల సొరచేపల జాతులున్నట్లు సమాచారం.
 • ఇవి మరణించిన తర్వాత వాటి అస్థిపంజరం ఎముకలు మృదులాస్థితో తయారవుతుంది. కాబట్టి వాటి అవశేషాలు ఏమైనా ఉన్నాయంటే దంతాలు, చర్మం, వెన్నెముక మాత్రమే. ఆ అవశేషాలను బట్టి అది ఏ జాతికి చెందినదో గుర్తించేందుకు వీలుంటుంది.
 • శిలాజ రికార్డులు విభిన్నంగా ఉన్నాయి. 150 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కొన్ని జాతులు ఇప్పుడు నివసించే కొన్ని జాతులతో పోలి ఉన్నాయని అవి చెబుతున్నాయి.
 • వీటి మొట్టమొదటి జాతుల్లో ఒకటి క్లాడోసెలా.
 • పాలిజోయిక్‌ యుగం (545-250 మిలియన్‌ సంవత్సరాల క్రితం) ఏక కణ జీవి నుండి అస్థి చేపలు, సొరచేపలు పరిణామం చెందాయి. ఆ సమయంలో సొరచేపల్లో వేగంగా పెరుగుదల కనిపించింది.
 • కార్బోనిఫెరస్‌ అని పిలువబడే యుగంలోనూ కొన్ని సొరచేపలు విచిత్రమైన ప్రవర్తనను కలిగి ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.
 • వీటిలో గొప్ప తెల్ల సొరచేప, ఎద్దు సొరచేప, టైగర్‌ షార్క్‌, నిమ్మ సొరచేప, బ్లూ షార్క్‌, ఇసుక పులి సొరచేపలు అత్యంత ప్రమాదకరమైనవి.
 • ఒక షార్క్‌ యొక్క ఎండిన దవడలు ఎముకలాగా కనిపిస్తూ ధృఢంగా ఉంటాయి.
 • సొరచేపలు కంటిచూపును కలిగి ఉంటాయి. వాస్తవానికి ఇవి చీకటి, వెలుతురు, రంగులను చూడగలవు.
 • సొరచేపలు ఎనిమిది ప్రత్యేకమైన ఇంద్రియాలను కలిగి ఉంటాయి. ఇవి మనుషులలాగే రుచి, వాసనను తెలుసుకోగలవు.