
బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా) : గుండెపోటుతో బుధవారం మరణించిన లెజెండ్ డీగో మారడోనాను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బ్యూనస్ ఎయిర్స్లోని బోకా జూనియర్స్ స్టేడియంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. మారడోనాను ఉంచిన శవపేటికపై జాతీయ జెండాను కప్పగా.. జెండాకు రెండోభాగంలో మారడోనా ట్రేడ్మార్క్ నంబర్ 10 ముద్రించబడి ఉంది. డీగో భౌతికకాయాన్ని సుమారు కోటిమందివరకు సందర్శిస్తారని అర్జెంటీనా ప్రభుత్వం భావిస్తోంది. గురువారం మధ్యాహ్నం తర్వాత మారడోనా భౌతికకాయాన్ని అధ్యక్ష భవనానికి తరలించారు. కుటుంబ సభ్యులు, మాజీ సహచరులు, అధికార, అనధికారులు అక్కడే నివాళులర్పించారు. బ్యూనస్ ఎయిర్స్ శివార్లలోని శ్మశాన వాటికలో డీగో భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు. ఇక్కడే మారడోనా తల్లిదండ్రులనూ ఖననం చేయడం జరిగింది. అర్జెంటీనా ప్రభుత్వం డీగో మృతికి మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

కేరళలో రెండు రోజులు..
మారడోనా మృతికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. కేరళ క్రీడామంత్రి ఇపి జయరాజన్ గురువారం ఓ ప్రకటనలో.. డీగో మృతి ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసిందని, కేరళలో కూడా లక్షలాదిమంది అభిమానులు ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోయారన్నారు. ఈ క్రమంలో నేటినుంచి రెండురోజులపాటు సంతాప దినాలను పాటించాలని రాష్ట్ర క్రీడా విభాగం నిర్ణయించిందని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మారడోనా మృతికి సంతాపం తెలిపారు. 2012, అక్టోబర్ 12న కేరళకు రెండురోజుల పర్యటన నిమిత్తం వచ్చిన మారడోనా.. కన్నూరు జిల్లా స్టేడియంలో 50వేలమంది అభిమానులకు ఫుట్బాల్ మెళకువలతోపాటు ఆటపాటలతో అలరించారు.

కాస్ట్రోను తండ్రితో పోల్చిన మారడోనా..
మత్తు పదార్థాలకు బానిసైన మారడోనాను కష్టకాలంలో ఆదుకున్న క్యూబా మాజీ అధ్యక్షుడు కాస్ట్రోను తన తండ్రితో పోల్చుకున్నారు. 2016లో కాస్ట్రో మరణవార్త విని తన తండ్రి మృతి తర్వాత అంతటి బాధ కలిగించిన సంఘటన ఇదేనని బాధపడ్డారు. క్యూబాకు చికిత్స నిమిత్తం వెళ్లిన తమమధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఏర్పడిందన్నారు.

శరీరంపై చెగువేరా, కాస్ట్రో టాటూలు..
డీగో మారడోనా ఇష్టపడిన వ్యక్తులను ఒంటిమీద టాటూలు వేయించుకొనే అలవాటు ఉంది. ఆ కారణంతోనే చెగువేరా టాటూను కుడిచేతిపై, కాస్ట్రో బమ్మను ఎడమకాలిపై వేయించుకొని మారడోనా తన అభిమానాన్ని చాటుకున్నారు.
సరిగ్గా నాలుగేళ్ళకు..
2016, నవంబర్ 25న కాస్ట్రో మరణించి సరిగ్గా నాలుగేళ్లకు అదే రోజు మారడోనా కూడా మరణించారు. ఫిడెల్ కాస్ట్రో 90ఏళ్ల వయస్సులో చనిపోగా.. ఇప్పుడు 4ఏళ్ల తర్వాత అదే రోజు 2020, నవంబర్ 25న 60ఏళ్ల వయస్సులో మారడోనా చనిపోయారు. ఇది యాదఅచ్ఛికమే అయినా.. స్నేహానికి నిదర్శనమని ఫుట్బాల్ అభిమానులు భావిస్తున్నారు.