May 03,2021 12:23

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ రావిచెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తుంది. ఆడకాకికి గుడ్లు పెట్టే సమయం వచ్చేసరికి అవి రెండూ కలిసి చెట్టు మీద ఓ గూడు కట్టుకొన్నాయి.
   అక్కడే కాస్త దూరంలో మరో రావిచెట్టు ఉంది. దానిమీద ఓ కోకిల నివసిస్తూ ఉంది. కోకిలకు, ఆడకాకికి మధ్య స్నేహం కుదిరింది. వాటి స్నేహం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ఓ రోజు కోకిల తను గుడ్డు పెట్టేందుకు కాకి గూటిని ఉపయోగించు కుంటానని అడిగింది. అందుకు కాకి 'భేషుగ్గా మిత్రమా! ఆ గూటిలో ఇప్పటికే నేను మూడు గుడ్లు పెట్టాను. నువ్వూ ఆ గూటిలోనే గుడ్డును పెట్టుకో' అంది స్నేహానికి విలువనిస్తూ. కోకిల కూడా తన గుడ్డును ఆ గూటిలోనే పెట్టింది. అలా ఆ గూటిలో నాలుగు గుడ్లు ఉన్నాయి.
   ఓ రోజు కాకి, కోకిల చెట్టుకొమ్మన కూర్చుని గానం చేస్తూ ఉండగా అటువైపు వెళుతున్న వేటగాడు విన్నాడు. వెంటనే తన వద్ద ఉన్న ఉండేలుతో కోకిలను గురిచూసి కొట్టాడు. కోకిల తలకు బలంగా దెబ్బ తగిలింది. తల నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా కాకితోపాటు ఎగురుకుంటూ వెళ్లి దాని గూటిలో దాక్కుంది. వేటగాడు నిరాశతో అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
తలకు తగిలిన దెబ్బ వల్ల తాను బతకనని గుర్తించిన కోకిల 'కాకి మిత్రమా! నేనిక బతకను. నీ గూటిలో నాకు ఆశ్రయాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. అలాగే నువ్వే నీ గుడ్లతోపాటు నా గుడ్డునూ పొదిగి, నా సంతతికి తోడ్పడగలవని ఆశిస్తున్నాను. నా ఆశను తీర్చిపెట్టు' అంటూ చెట్టుమీద నుంచి ధబీమని కిందపడి చనిపోయింది.
   కాకి తన మూడు గుడ్లతో పాటు కోకిల గుడ్డునూ పొదిగి, నాలుగు పిల్లలకు ప్రాణం పోసింది. ప్రతిరోజూ అడవిలోకి వెళ్ళి ఆహారాన్ని తెచ్చి, తన పిల్లలతో పాటు కోకిలపిల్లకూ పెడుతూ చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది.
   కొన్నాళ్ళకు ఆ నాలుగూ కాస్త పెద్దయ్యాయి. వాటి మధ్య రూపురేఖల్లో తేడాలు కనిపించసాగాయి. కాకిపిల్లలు కోకిలపిల్ల తేడాగా ఉండటం గుర్తించాయి. అంతే దానిమీద కోపం పెంచుకున్నాయి. ఎలాగైనా సరే కోకిలపిల్లను తరిమేయాలని నిర్ణయించుకున్నాయి.
ఓ రోజు తల్లికాకి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. అదనుకోసం ఎదురు చూస్తున్న కాకి పిల్లలు కోకిలపిల్లపై దాడికి దిగాయి. గూటిని విడిచి వెళ్ళిపొమ్మని ముక్కులతో పొడవసాగాయి. అంతలో తల్లికాకి వచ్చింది. గూటిలో ఓ మూలకొదిగి ఏడుస్తున్న కోకిలపిల్లను గమనించింది. అది అలా ఏడవటానికి తన పిల్లలే కారణమని గ్రహించింది. తన పిల్లలు చేసిన తప్పును వాటికి తెలియజేయాలి అనుకుంది. వెంటనే 'పిల్లల్లారా! నేను చెప్పేది కాస్త వినండి. సహజంగా జాతులు, కులమతాలు, వర్ణాలు, వాటిద్వారా కలిగే ఈర్ష్యా ద్వేషాలు మనుషులకు ఉంటాయి. కానీ మన పక్షులము అలా కాదు. మన జీవితకాలమూ తక్కువే! అందుకే మనం బతికినంత కాలం అన్నదమ్ముల్లా, అక్కచెల్లెల్లా కలిసిమెలిసి ఉండాలి. ఇక కోకిలపిల్ల విషయానికొస్తే.... వాళ్ళమ్మ నాకు ప్రాణ స్నేహితురాలు. మా స్నేహబంధం బలమైంది. ఓ రోజు వేటగాడి ఉండేలు దెబ్బకు గురై, వాళ్ళమ్మ చనిపోయింది. అది చనిపోతూ దీనిని కాపాడాల్సిన బాధ్యతను నాకు అప్పగించింది. నేనూ స్నేహానికి విలువనిచ్చి, మీతో పాటు దానినీ కాపాడుతూ వస్తున్నాను. కానీ ఈ కోకిలపిల్ల మీకు తేడాగా కనిపిస్తూనే అది మనజాతి కాదని, అలాంటిది మీతో కలిసి ఉండకూడదన్న నిర్ణయానికొచ్చి, తరిమి వేయాలని ప్రయత్నిస్తున్నారు. అది తప్పు. దాన్ని మీ తోడపుట్టిన తమ్ముడిలా భావించుకొని ప్రేమగా చూసుకోండి. మీ నలుగురిని చూస్తే ఇతరులు సైతం నోటిమీద వేలు వేసుకోవాలి తెలిసిందా!?' అంటూ హితవు పలికింది తల్లి కాకి.
తల్లి మాటలు విన్న కాకిపిల్లలకు తాము చేసిన తప్పేంటో తెలిసింది. వెంటనే మూడు కాకి పిల్లలు ఒక్కటిగా 'కోకిల తమ్ముడూ! మమ్మల్ని క్షమించి, నువ్వూ మాతోనే ఉండిపో. అందరం కలసి ఒక తల్లి పిల్లలుగా ఉందాం. అమ్మ చెప్పినట్టు నడుచుకొంటూ ముందుకు సాగుదాం' అన్నాయి కోకిలపిల్లతో ప్రేమగా.
 

- బొందల నాగేశ్వరరావు,
95000 20101

nageswararaobondala@gmail.com