Dec 05,2021 20:45

మాట్లాడుతున్న జి.పుల్లయ్య

సంస్కృతికి, నదులకు అవినాభావ సంబంధం
రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య
ఘనంగా హంద్రీ దినోత్సవం

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌
భారతదేశ నాగరికత సంస్కృతికి, వికాసానికి, నదులకు అవినాభావ సంబంధం ఉందని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య అన్నారు. ఆదివారం స్థానిక సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో మానవశక్తి పరిశోధన కేంద్రం సౌజన్యంతో మహిళా సాధికారత శాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ శాఖలు సంయుక్తంగా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినం, హంద్రీ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించి స్వచ్ఛంద సేవా, గొప్పదనం, ఆవశ్యకతను వివరించారు. రసాయనిక శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్‌ అనూష అతిథులకు స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా హాజరైన రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య మాట్లాడుతూ ఇండియా పేరు కూడా ఇండస్‌ నది నుండి వచ్చిందన్నారు. స్వచ్ఛంద సేవకులు, నదీ పరివాహక ప్రాంతాల రక్షకులుగా పని చేయాలన్నారు. మానవశక్తి పరిశోధన నిర్దేశకులు ఆచార్య మన్సూర్‌ రహమాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 5000 ఆనకట్టల కారణంగా సహజ సిద్ధంగా ఉన్న నదులు దారులు మారి పర్యావరణ దుష్ఫలితాలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. అందుకు నిదర్శనంగా హంద్రీ నదిని చెప్పవచ్చన్నారు. మహిళా సాధికార శాఖ సమన్వయకర్త డాక్టర్‌ అక్తర్‌ భాను మాట్లాడుతూ పురాణాల్లో హేన్ద్రావతిగా ఉన్న హంద్రీ నది చరిత్రను కర్నూలు నగర ప్రజల సామాజిక ఆర్థిక జీవనంలో దాని ప్రధాన పాత్రను వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ అధికారిని డాక్టర్‌ ఫమీదా బేగం మాట్లాడుతూ ఉన్నతమైన ఆశయంతో పని చేస్తే ఉత్తమమైన ఫలితాలు సాధ్యమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ అధికారులు డాక్టర్‌ వెంకన్న డాక్టర్‌ మోహన్‌ నాయకులు స్వచ్ఛంద సేవకులు నిస్వార్థ సేవ చేసి సమాజంలో ఆదర్శంగా ఉండాలి అన్నారు.
ప్రతిజ్ఞ : నదీ పరివాహక ప్రాంతాలను, సరస్సులను, చెరువులు, వాగులు, వంకలను, అవి ప్రవహించు ప్రాంతాలను కాపాడుతామని విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులతో డాక్టర్‌. అక్తర్‌ భాను ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్‌ షహనాజ్‌ బేగం, డాక్టర్‌ సుధారాణి, డాక్టర్‌ రవి ప్రకాష్‌, డాక్టర్‌ వై రాజశేఖర్‌, డాక్టర్‌ ఎం.రామాంజనేయులు, డాక్టర్‌ విఎం.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ వెంకట్‌ లక్ష్మి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డాక్టర్‌ అక్తర్‌భాను తదితరులు