Sep 15,2021 20:30

హైదరాబాద్‌ :  డెక్కన్‌ రైస్‌ బ్రాండ్‌ పేరుతో బియ్యం ఎగుమతుల్లో ఉన్న డెక్కన్‌ గ్రెయింజ్‌ కొత్తగా హైదరాబాద్‌ సమీపంలో ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను నెలకొల్పింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద ఉన్న టిఎస్‌ఐఐ జనరల్‌ పార్క్‌లో రూ.15 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్‌ టెక్నలాజీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ సామర్థ్యం నెలకు 5,000 మెట్రిక్‌ టన్నులని డెక్కన్‌ గ్రూప్‌ సిఎండి కిరణ్‌ పోలా తెలిపారు. ప్రస్తుతం తాము అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియాకు అత్యంత నాణ్యమైన సోనా మసూరి, ఇతర బియ్యం రకాలను ఎగుమతి చేస్తోన్నామన్నారు. భారత రిటైల్‌ మార్కెట్లో అడుగు పెట్టనున్నట్టు తెలిపారు. 25 ఏళ్లుగా ఎగుమతుల్లో ఉన్నట్టు చెప్పారు. ఎగుమతుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.50 కోట్ల ఆదాయం ఆర్జించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల ద్వారా రూ.100 కోట్లు, దేశీయ మార్కెట్‌ నుంచి మరో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సోనా బియ్యంను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు.