Jun 09,2021 19:13

అంజనికి చిన్న వయసులోనే పెళ్లి అయింది. భర్త మంచిచెడులు, ఆ తర్వాత కూతురు బాగోగులు.. ఇవే తన జీవితం అనుకున్నారామె. కొంత కాలానికి తాను ఏదొక విధంగా సమాజానికి ఉపయోగపడాలని అనుకొని, ఏం చేయగలనా అలి ఆలోచించారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారిత దిశగా తన కృషి ఆరంభించారు. ఎవిఎం క్రియేషన్‌ పేరుతో సందేశాన్నించే చిన్న సినిమాలు తీస్తూ... ఎవిఎం ఆర్గనైజేషన్‌ పేరిట సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ కాలంలో ఎంతోమంది రోగులను ఆదుకొని ఆప్తురాలు అయ్యారు.

కృష్ణా జిల్లా ఏలూరు నగరానికి దగ్గర వట్లూరు గ్రామానికి చెందిన వేగుంట సుబ్బారావు, సత్యవాణి దంపతుల కుమార్తె అంజని. తండ్రి కాలేజి లెక్చరర్‌ అయినా అనారోగ్య కారణంగా మంచంలోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. కూతురికి పెళ్లి చేయకుండానే చనిపోతానన్న భయంతో అంజనికి 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. వివాహం అనంతరం విజయవాడలో స్థిరపడిన భర్త వెంకటేశ్వరరావు మంచిచెడులు చూసుకుంటున్న ఆమెకి మహిత పుట్టింది. కూతురు బాగోగులు, చదువు, పెళ్లి బాధ్యతలతో ఆమె క్షణం తీరిక లేకుండా గడిపింది.

సందేశాత్మకంగా.. సహాయకురాలిగా..


కూతుర్ని అత్తవారింటికి పంపిన ఆమెకి ఒక రోజు తన జీవితంలో తాను ఏమి సాధించిందో ఒకసారి ఆత్మావలోకనం చేసకున్నారు. తనకిష్టమైన సాహిత్యాన్ని మళ్లీ చదవడం ప్రారంభించారు. తను కూడా కొన్ని పుస్తకాలు రాసే ప్రయత్నం చేశారు. తనలో దాగిఉన్న ప్రతిభను తెలుసుకుంటేనే సమాజంలో తీవ్ర అణివేతకు గురౌతున్న మహిళలకు ఏదైనా చేయాలనుకున్నారు. చిన్నపిల్లలు, ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రతిఒక్కరూ ఖండించాలని చెబుతూ 'మౌనమూ నేరమే' అనే స్లోగన్‌తో 2017లో 'ఎంవిఎం క్రియేషన్స్‌' అనే ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఆ ప్రయత్నానికి తన స్నేహితులు కూడా తోడయ్యారు.
 

సందేశాత్మకంగా లఘుచిత్రాలు..
ఆడవాళ్లు, బాలికలపై జరిగే అన్యాయాలపై షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తూ ప్రశ్నిస్తున్నారు అంజని. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పూర్వపు రోజుల్లో మహిళలు ఏ విధంగా అణిచివేతకు గురయ్యారో తెలుపుతూ 'వరద గుడి' అనే లఘుచిత్రానికి రచయిత అయ్యారు. ఈ చిత్రానికి సోషల్‌ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో నంది పురస్కారాల జ్యూరీ మెంబర్‌గా అప్పటి ప్రభుత్వం నియమించింది. ప్రయివేటు కంపెనీల ప్రకటనల కోసం మహిళలను వ్యాపార వస్తువుగా చూడటం, టీవీ సీరియళ్లలో ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులన్న ఉద్దేశంతో విలన్ల పాత్రలను పెంచి పోషించడాన్ని విమర్శిస్తూ అంజని కొన్ని సందేశాత్మక చిత్రాలను నిర్మించారు. సమాజంలో జరుగుతున్న మార్పులు గమనించకుండా గృహిణులు ఇల్లు, పిల్లల సంరక్షణ బాధ్యతలు ఎలా చూసుకోగలరు? అని చెబుతూ స్ఫూర్తిదాయకంగా ఓ షార్ట్‌ఫిల్మ్స్‌ రూపొందించారు. బాలికలపై అత్యాచారాలు, మహిళలపై హింస, వీధి బాలల సంక్షేమం, విద్య, నగర పరిశుభ్రత, ప్లాస్టిక్‌ నిషేధ చట్టం అమలు కోసం ఎన్నో అవగాహనా ర్యాలీలు, వర్క్‌షాపులు తమ సంస్థ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. మహిళ రక్షణ కోసం ఏర్పడిన అన్ని రకాల యాప్‌ల వినియోగం, స్వీయ రక్షణ సూచనలు తెలుపుతూ 'భద్రం బిడ్డ' పేరిట నిర్మించిన లఘు చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టారు.
 

సందేశాత్మకంగా.. సహాయకురాలిగా..

కోవిడ్‌ నేపథ్యంలో సేవ..
ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభ సమయంలో కోవిడ్‌ ప్రభావిత కుటుంబాలకు సాయం అందించాలని అంజలి అనుకున్నారు. ఒక్కసారిగా కేసులు ఎక్కువ కావడంతో చాలామంది పేషెంట్స్‌ ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న పరిస్థితి. అలాంటి వారికి డాక్టర్లు మురళీకృష్ణ, గణేష్‌, పాపారావుల సలహా మేరకు వైద్యం అందించింది. పగలు, రాత్రీ అనే తేడా లేకుండా రోగులకు సహకారం అందించారు. వైద్యులు కూడా చాలా సహనంతో కోవిడ్‌ బాధితులకు వైద్య సలమాలు అందించారు. కోవిడ్‌ కారణంగా భయపడుతున్న వృద్ధులకు, రోగులకు ప్రత్యేకంగా అంజని కౌన్సిలింగ్‌ కూడా ఇప్పించారు.


కోవిడ్‌ బారిన పడ్డ కుటుంబాలకు స్వయంగా ఇంట్లోనే తయారుచేసిన భోజనాన్ని హెల్పర్లు నాగబాబు, కనకరాజు సహాయంతో మూడు పూటలా పంపిణీ చేశారు. బలమైన ఆహారంతోనే రోగులు త్వరగా కోలుకోవాలన్న ఉద్దేశం రాగి జావ, గుడ్లు ఆ మెనూలో ఉండేలా చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో కూడా రోడ్ల మీదకి వచ్చి కష్టపడుతున్న పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ప్రతిరోజూ మజ్జిగ బాటిళ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
రైల్వేస్టేషన్‌, గుళ్ల దగ్గర, ఫైఓవర్‌ వద్ద యాచిస్తున్న రోజూవారీ కూలీలు, చిన్న చిన్న వ్యాపారస్తులను గుర్తించి వారికి నెలకు సరిపడా సరుకులను అందజేశారు. ఇదే విధంగా కోవిడ్‌ మొదటి వేవ్‌లో కూడా అంజని చాలా మందికి సహాయపడ్డారు.

సందేశాత్మకంగా.. సహాయకురాలిగా..


కోవిడ్‌ రెండో దశలో మృత్యువాత పడుతున్న వారిని చూసి అంజని చలించిపోయారు. తనకు చేతనైన సాయం చేయాలన్న ఉద్దేశంతో సిఆర్‌ఆర్‌ కాలేజీ చదువుకున్న 1993 బ్యాచ్‌కి చెందిన వారిని సంప్రదించారు. వారు చేసిన ఆర్థిక సహాయంతో పిపిఇ కిట్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆహారం, మందులు, ఇతర సరుకులను నెల రోజులుగా కోవిడ్‌ కుటుంబాలకు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తాను అందించిన సహాయానికి ప్రతి ఒక్కరూ అంజనికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మహిళా సాధికారిత, పర్యావరణ పరిరక్షణ, బాలికా సంరక్షణ వంటి అంశాలపై తమ కృషిని మరింత కొనసాగించాలని భావిస్తున్న అంజని ఆ దిశగా మరింత అభివృద్ధి సాధించాలని ఆశిద్దాం.

సందేశాత్మకంగా.. సహాయకురాలిగా..